పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నం నోటిచెంతకు రాకముందే నోరు పెద్దగా తెరవకూడదు. పళ్లేంనిండ అన్నం కూరలు పెట్టుకోగూడదు. నోటినిండ భోజనం కుక్కుకోగూడదు. నోటిలో భోజనం పెట్టుకొని మాటలాడకూడదు. పండ్లు మిఠాయిలు మొదలైనవి ఉమ్మడిగా తీసికొనేపుడు మనం ముందుగా మంచివాటిని ఏరుకొని తీసికోగూడదు. పదిమందితో కలసి భుజించేప్పడు మన ప్రక్కవారి అవసరాలను కొంచెం గుర్తించాలి.

4. సంభాషణ మర్యాదలు

నరుల సంభాషణను బట్టి కూడ వాళ్ల సంస్కారాన్ని అంచనా వేయవచ్చు. చదువుకొన్నవాళ్లు అసభ్యపదాలను వాడకూడదు. మనమాటల్లో కొంచెం హాస్యముంటే మంచిది. సంభాషణ అంతా మనమే గుత్తకు తీసికోగూడదు. ఇతరులను కూడ మాటలాడ నీయాలి. వారి పలుకులు వినాలి. పరుల శీలాన్ని నిందిస్తూ మాటలాడకూడదు. వారి చేతలకు అపార్థాలు కలిగంచ కూడదు. "నేను” అనే మాటను కొంచెం తగ్గించి "మేము" అనే పదాన్ని ఎక్కువగా వాడ్డం మంచిది. ఎదుటివ్యక్తిని గూర్చి వ్యంగ్యంగాను, అపహాస్యంగాను మూటలాడ కూడదు. పరుల దుస్తులు, పద్ధతులు మొదలైన వాటిని ఆక్షేపించకూడదు. మన విజయాలు, పరిచయాలు, స్నేహాలు మొదలైన వాటిని గూర్చి గొప్పలు చెప్పకోగూడదు. పరుల కుటుంబం, జీతం మొదలైన వాటిని గూర్చి వివరాలు అడగకూడదు. జేబుల్లో గాని పిరుదులమీదగాని చేతులు పెట్టుకొని లేదా సిగరెట్టు నోటిలో పెట్టుకొని మొనగాళ్లలాగ వూటలాడకూడదు. మనమాటల్లో డాబుసరికంటె వినయం, అణకువ ఎక్కువగా కన్పించాలి. మాటలకు మనం ఊహించనిశక్తి వుంటుంది. కనుక వాటిని జాగ్రత్తగా వాడాలి. తగాదాలు తెచ్చిపెట్టుకొనే లాగ మాటలాడకూడదు. ఎప్పడు గూడ మనసుని ప్రశాంతంగాను నిమ్మళంగాను దయాపూరితంగాను వుంచుకోవాలి. అప్పుడు మన నోటినుండి వచ్చే మాటలుకూడ సవ్యంగా, మృదువుగా వుంటాయి. మాట నేర్పు కొందరికే వుంటుంది.