పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చమురు వేసిన చక్రం మెత్తగా తిరుగుతుంది. నరునికి మర్యాదావర్తనం ఈ చమురు లాంటిది. ఇతరులను గూర్చి మంచిగా తలంచడం, మంచిగా మాటలాడ్డం, మంచిని చేయడం మర్యాదకు పునాదులు

జీవితంలో విజయాన్ని సాధించాలంటే మర్యాదను పాటించాలి. చాలమంది సభ్యతగా మెలిగి కష్టమైన కార్యాలు సాధించుకొని వచ్చారు. అమర్యాదవల్ల తమ కార్యాలను చెడగొట్టుకొన్నారు. మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడానికి గూడ మర్యాద అవసరం. సభ్యతగలవాణ్ణి ప్రజలు గౌరవిస్తారు. చాల పర్యాయాలు దయచేసి, క్షమించండి, కృతజ్ఞజ్జి మొదలైన చిన్నచిన్న మాటలే మర్యాదను తెలియజేస్తాయి.

1. వ్యక్తిగతమైన సభ్యత

మన శరీరం శుభ్రంగా వుండాలి. త్రేన్పులు, ఆవులింతలు, ముక్కు చీదుకోవడం, దగ్గడం మొదలైన క్రియలను నిశ్శబ్దంగా చేయాలి. ఇతరులూ మనమూ కలిసి ఒకే గదినీ, బాత్రూమనీ వాడుకొనేప్పడు ప్రత్యేక నియమాలు పాటించాలి. ఆయా వస్తువులూ స్థలాలూ శుభ్రంగా వుంచాలి.

2. సాంఘికమైన సభ్యత

పెద్దలు వచ్చినపుడు లేవడం మర్యాద. క్రొత్తవారికి మన దగ్గరవున్న వ్యక్తులను పరిచయం చేయాలి. పెద్దవాళ్లకు చిన్నవాళ్లను పరిచయం చేయాలి. ఈ రోజుల్లో కరచాలనం సర్వసాధారణమైంది. స్త్రీల విషయంలో మాత్రం నమస్కారం సరిపోతుంది.

3. భోజన మర్యాదలు

చాలమంది భోజన మర్యాదలను పట్టించుకోరు. కాని వీటిని పాటించాలి. కొందరి దృష్టిలో ఇవి సంస్కారానికి ముఖ్యచిహ్నాలు. పదిమందితో కలిసి భుజించేప్పడు మన దుస్తులు శుభ్రంగా వుండాలి. కాఫీ, టీలు సాసరునుండి త్రాగకూడదు. మనం వడ్డించుకోక ముందు ఇతరులకు వడ్డించడం మర్యాద.