పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైకేల్ ఆంజెలో, సోక్రటీసు వికారంగా వుండేవాళ్లు, శివాజీ, లాల్ బహదూర్ శాస్త్రి పొట్టివాళ్లు. ఐనా వీళ్లందరూ పేరు ప్రఖ్యాతలు సాధించారు కదా?

2. రూపంకంటె ప్రవర్తన ముఖ్యం

సుందరమైన ఆకృతివల్లనే విజయాన్ని సాధించం. మంచి దుస్తులువల్లా అలంకరణంవల్లా మాత్రమే సుప్రసిద్దులం కాము. మనిషికి బాహ్యకారం కాదు, హృదయం ముఖ్యం. మన తెలివితేటలూ, చురుకుదనమూ, నడవడికా, సాధించిన విజయాలూ మనకు గుర్తింపు తెచ్చిపెడతాయి. కనుక యువత ఈ సుగుణాలను వృద్ధి చేసికోవాలి.

యూదయువతి గోల్గా మాయర్ వికారంగా వుండేది. ఆమె నేనెటూ అందంలో రాణించలేను. శక్తి సామర్థ్యాలతో రాణిస్తాను అనుకొంది. బాగా కృషి చేసింది. కడన యిస్రాయేలుకు ప్రధాన మంత్రి ఐంది.

సౌందర్యం కంటె శీలం, కష్టించి పనిచేయడం, కరుణ, కలుపుగోలుతనం, పేదసాదలను ఆదుకోవడం మొదలైన వూనవీయ గుణాలు ముఖ్యం. చక్కదనానికుండే విలువ, ఆకర్షణ దానికున్నాయి, కాదనం. భగవంతుడు మనకు రూపాన్ని దయచేసినపుడు సంతోషించవచ్చు. కాని అది లేనపుడు కుమిలి పోవలసిన అవసరం లేదు. మనిషి మరొక విధంగా రాణించవచ్చు. సొగసు కంటె శీలం, సామర్థ్యం ముఖ్యం.

12. మర్యాదా పద్ధతులు

మనిషి ప్రవర్తించే తీరును బట్టే అతడు సభ్యత సంస్కారం కలవాడో లేదో చెప్పవచ్చు. సంస్కారంగల నరుడు మర్యాదగా మెలుగుతాడు. అది లేనివాడు అమర్యాదగా ప్రవర్తిస్తాడు. సంస్కారంగలవాళ్లు సున్నితంగా మాటలాడతారు. వాళ్ల పలుకులు నెమ్మదిగా మృదువుగా వుంటాయి. మనదేశంలో చాలమంది మర్యాదను పాటించరు. ఆటవిక జనంలాగ ప్రవర్తిస్తారు. జనులు చిన్ననాడే మర్యాదా పద్ధతులు అలవర్చుకోవాలి. విద్యార్థులు స్కూల్లో మర్యాదాపద్ధతులను తప్పక నేర్చుకోవాలి.