పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేమశక్తి లేనిదే నిజమైన సంతోషం లేదు. అది వున్నచోట భగవంతుడు కొలువుదీరి వుంటాడు.

10. లైంగిక శక్తి

1. రెండు వరాలు భగవంతుడు నరులకు దయచేసిన భాగ్యాలన్నిటిలోను జీవితమే గొప్ప భాగ్యం. బ్రతికి వుండకపోతే ఏ యానందం లేదు కదా! ఎన్ని కష్టాలు వ్యాధి బాధలు వచ్చినా బ్రతికి వుంటే చాలు అనుకొంటాం. చనిపోవడానికి బుద్ధి పూర్వకంగా ఎవరూ వొప్పుకోరు. మానసిక శాస్త్రవేత్తలు తాత్కాలికంగా బుద్ధిశక్తిని కోల్పోయినవాళ్లు మాత్రమే ఆత్మహత్య చేసికొంటారు అని చెప్తారు.

మానవ జీవితానికి వెలకట్టడం సాధ్యంకాదు. మనం జీవితంలో ఎన్ని విజయాలు సాధించం? ఎన్ని మంచి పనులు చేయం? ఎందరి పట్ల ప్రేమానురాగాలు చూపం? ఎన్ని వుపకారాలు, త్యాగాలు చేయం? వీటన్నిటికి వెలకట్టగలమా? బ్రతికివుంటే ఈలాంటి మంచి కార్యాలు ఎన్నో చేస్తాం. కనుక బ్రతికి వుండడం కంటె గొప్పకార్యం మరొకటి లేదు.

జీవితం తర్వాత భగవంతుడు మనకు దయచేసిన రెండవ గొప్పవరం లైంగిక శక్తి ప్రీ పురుషుల లైంగిక సంబంధం ద్వారా క్రొత్త నరులు పుడతారు. లోకస్థితి కొనసాగిపోతుంది. లైంగిక శక్తి ఉన్నతమూ, పవిత్రమూ ఐంది అనడానికి అనేక కారణాలున్నాయి. ఈ శక్తి ద్వారా తల్లిదండ్రులు తమను పోలిన నూత్న నరులను సృజిస్తారు. ఆ నరులు ఈ లోకంలో ఎన్నో సత్కార్యాలు విజయాలు సాధించేలా చేస్తారు. ఇంకా, ఈ శక్తిద్వారా నరులు భగవంతుని సృష్టికార్యంతో సహకరిస్తారు. దేవుడూ నరులూ కలసి భూమిపై నూత్న నరులను పుట్టిస్తున్నారు. పైగా, ఈ శక్తి ద్వారానే ఇద్దరు ప్రీ పురుషులు పరస్పరం ఐక్యమై ఒకరినొకరు గాఢంగా ప్రేమిస్తున్నారు. దాంపత్య ప్రేమ భగవంతుని దివ్య ప్రేమకు ప్రతిబింబంగా