పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపూర్ణుణ్ణి కాకపోవచ్చు. ఐనా నేనూ ఒకపాటివాణ్ణి అనుకోవాలి. అన్ని ప్రేమలకూ స్వీయప్రేమ పునాది లాంటిది.

2. పొరపాట్లను ఓర్చుకోవాలి. మన జీవితంలోను ఇతరుల జీవితంలోను పొరపాట్లు జరుగుతుంటాయి. వాటిని అంతగా పట్టించుకోగూడదు. మనం దేవతలంగాదు, నరమాత్రులం అనుకోవాలి. తప్పచేయనివాణ్ణి స్నేహితుణ్ణి చేసికొంటాను అనుకొంటే మనకు అసలు స్నేహితులే దొరక్కపోవచ్చు.

3. శత్రువులను క్షమిస్తుండాలి. పగపెంచుకొంటే ప్రేమ నశిస్తుంది. అతడు నాకింత కీడు చేశాడు, ఇక నేనేలాగు క్షమిస్తాను అనుకోగూడదు. ఇతరుల అపరాధాలను నెమరు వేసుకొంటూ కూర్చుంటే ప్రేమ వట్టిపోతుంది. హృదయంలో అమృతానికి బదులుగా విషం ఊరుతుంది. మనకు శత్రువునుండి కలిగే కీడుకంటె, అతని వలన మనకు మనమే చేసికొనే కీడు గొప్పది. శత్రువుని ప్రేమించినపుడు హృదయంలోని విషాన్ని కకివేసికొంటాం.

4. తోడివారిని ప్రశంసించాలి. మంచి యొక్కడ కన్పించినా సంతోషించాలి. మన చుటూ వున్నవాళ్లు ఎన్నో మంచిపనులు సాధిస్తుంటారు. వాళ్లను తప్పక మెచ్చుకోవాలి. లోకంలోని జనం మమ్మెవరు మెచ్చుకొంటారా అని కాచుకొని వుంటారు. విశేషంగా యువతకు మెప్పకోలు చాల అవసరం. ఒక వ్యక్తిని మెచ్చుకొన్నపుడు అతనికి మన ప్రేమను పంచియిచ్చినట్లే

5. విరోధులను ప్రేమించాలి. విరోధులను క్షమించడం మాత్రమే కాదు, వారిపట్ల ప్రేమకూడ చూపాలి. ఇది కష్టమైన కార్యం. ఒకసారి అబ్రహాంలింకను చెరలో వున్న శత్రుసైనికులను చూడబోయాడు. వారితో ప్రీతితో మాట్లాడాడు. ప్రక్కన వున్నవాళ్లు అయ్యా! వీళ్లు మనకు విరోధులు. నీవు వీరితో ఆప్యాయంగా మాట్లాడ కూడదు. మనం వీళ్లను నాశం చేయాలి అని సలహా యిచ్చారు. లింకను నేను వీరితో ప్రీతితో మాట్లాడినపుడు మన శత్రుత్వాన్ని నాశం చేస్తున్నాను కదా అన్నాడు. 6. కొన్నిసార్లు ఇతరులు మన ప్రేమను అంగీకరించరు, తిరస్కరిస్తారు.