పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ వ్యక్తి లోపాలను భూతద్దంలోంచి చూస్తాం. అతని లోపాలను గోరంతలు కొండంతలు చేస్తాం. అసలు అతనిలో అన్నీలోపాలే కాని సద్గుణాలు ఉన్నట్లుగా కన్పించదు. అతనివల్ల మనకేదో పెద్దనష్టం, ప్రమాదం కలగబోతుంది అనుకొంటాం.

విరోధిని గూర్చి మనసులో మనతో మనమే మాట్లాడుకొంటాం. అతడు ఆలా కాకుండ ఈలా చేయవలసింది అని మనసులో మనతో మనమే చెప్పకొంటాం. ఈ యాలోచనలు గొలుసుకట్టుగా, ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపడతాయి. వాటిల్లో వాస్తవికత, హేతుబద్ధత వుండదు. మనం ఊహించే ఆలోచనలన్నీ విరోధిలో యధార్థంగా వుండవు. ఈ యాలోచనలను మనం ఆపాలన్నా ఆపలేం. అప్రయత్నంగా వచ్చేస్తాయి. వీటిని Self-Talkఅంటారు. ఈ వివిధదశల వల్ల మనకోపం నిప్ప రాజుకొన్నట్లుగా రాజుకొని పెద్దమంట ఔతుంది.


4. శరీరంలో కలిగే మార్పులు

ఆగ్రహంవల్ల శరీరంలో చాలమార్పులు జరుగుతాయి. శ్వాస కష్టమౌతుంది. గుండె వేగంగా కొట్టుకొంటుంది. దాని చప్పడు వింటాం. రక్తపోటు పెరుగుతుంది. శరీరంలో వేడి పడుతుంది. ఆయాసం కన్పిస్తుంది. ముఖం, కండ్లు ఎర్రబడతాయి. పిడికిళ్లు బిగిస్తాం. పెద్దగా, వేగంగా మాట్లాడతాం. బిపి, కొలెస్టరాల్ పెరుగుతాయి. ఇవన్నీ అనారోగ్య కారకాలు. మన కోపం వల్ల ఇతరులకు నష్టం కలగదు. మనకే అనర్ధం కలుగుతుంది.

5. కోపం వల్ల నష్టాలు

కోపం వల్ల చాలవిధాలుగా నష్టపోతాం. అది ప్రశాంతంగా ఆలోచించి నిజానిజాలు తెలుసుకో నీయదు. మబ్బు సూర్యమండలాన్ని కప్పివేసినట్లుగా ఆగ్రహం బుద్ధిశక్తిని కప్పివేస్తుంది. మనం తొందరపడి లేనివి ఉన్నట్లుగా ఊహిస్తాం. దోషాలు లేనిచోట కూడ దోషాలు చూస్తాం. అనుచితమైన నిర్ణయాలు చేసికొంటాం.