పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనదేశంలో భారత రామాయణాలు గొప్ప గ్రంథాలుగా ప్రసిద్ది చెందాయి. బైబులు, కొరాను, భగవద్గీత లాంటి ప్రసిద్ద మత గ్రంథాలు కూడ ఈ కోవలోకె వస్తాయి. చిల్లరమల్లర పుస్తకాలు పది చదివిన దానికంటె ఒక గొప్ప గ్రంథం చదివినప్పడు ఎక్కువ సంస్కారం కలుగుతుంది. మన వ్యక్తిత్వం వృద్ధి చెందుతుంది.


టీవీ ప్రచారం వల్ల పుస్తక పఠనం అంతరించి పోతుందని కొందరు భావించారు. కాని ఆలా యేమీ జరగలేదు. అన్ని దేశాల్లోను పుస్తక పఠనం పెరుగుతుందే గాని తరగడం లేదు. జ్ఞానం బహుముఖంగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో విద్యార్థులు పాఠ్యగ్రంథాలతో సరిపెట్టుకోకూడదు. లైబ్రరీ గ్రంథాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలి. జ్ఞానం మన శక్తినీ పలుకుబడినీ పెంచుతుంది.

2. రేడియో

ప్రసార సాధనాల్లో రేడియోకే ఎక్కువ ప్రాముఖ్య ముంది. అది అన్నిచోట్ల దర్శనమిస్తుంది. ప్రపంచంలో నూరుకోట్ల రేడియోలు ఉపయోగంలో వున్నాయి. ప్రపంచ జనాభాలో ప్రతి నల్గరిలోను ఒకరు రేడియో వింటారు. పెద్ద గుంపుని ఆకట్టుకోవాలంటే ఇది సులువైన మాధ్యమం. చదువు సంధ్యల్లేని పల్లెల్లో రేడియో బాగా ఉపయోగ పడుతుంది.

నీరు రాతిమీద పడి దాన్ని అరగదీసి చివరకు నాశం జేస్తుంది. ఆలాగే రేడియో కూడా జనాన్ని బాగా ప్రభావితం చేసి వారిలో క్రమేణ మార్పు తెస్తుంది. దేశాన్ని విద్యావంతం చేయడానికి జాతీయ సమైక్యతను సాధించడానికి ఇది ఉపకరిస్తుంది. విశేషంగా స్త్రీలకూ పిల్లలకూ ఆయా విషయాలు నేర్పడానికి రేడియో బాగా పనికివస్తుంది. పట్టణాలకంటె గూడ పల్లెల్లో దీని ఉపయోగం ఎక్కువ.


వేరె మాధ్యమాలకు లేని సదుపాయాలు రేడియోకు ఉన్నాయి.

1. ఒక సంఘటనం జరగగానే దాన్ని రేడియోలో విన్పించవచ్చు. పెద్ద జనసమూహానికి, ఒకేసారి చాల తావుల్లో కూడ దీన్ని విన్పించవచ్చు.