పుట:Naitikamargam - Fr.Jojayya.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. స్నేహితుల అవసరాలనూ ఇబ్బందులనూ గుర్తిస్తుండాలి. లేకపోతే వారికి మనమీద నమ్మకం పోతుంది.

9. కులం, మతం, వర్గం, రంగు మొదలైనవాటిని బట్టి ప్రజలను కేటాయించకూడదు.

10. మిత్రులతో పోటీకి దిగకూడదు.

సఖ్యసంబంధాలు పెంపొందించుకోవడం చాల సున్నితమైన విషయం. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా సఖ్యత చెడుతుంది. కనుక ఈ విషయంలో ఎప్పడూ మెలకువగా వుండాలి.

4. నైతిక విలువలను పాటిస్తేనే గౌరవం మనిషి గొప్పతనం నైతికవిలువలను పాటించడం లోనే వుంటుంది. లింకన్, గాంధీ మండేలా మొదలైన మహానాయకులు విలువల ప్రకారం జీవించడం వల్లనే పేరు తెచ్చుకొన్నారు. ఒక్క వ్యక్తులు మాత్రమే కాక విద్యాసంస్థలూ వ్యాపార సంస్థలు కూడ విలువలను పాటిస్తాయి. రాజకీయ పక్షాలకుకూడ అవి పాటించే విలువలను బట్టే గౌరవం వస్తుంది.

విలువలను పాటించేవాళ్లు గొప్ప శక్తిని పొందుతారు. వాళ్ల విజయాలు సాధించి కీర్తి తెచ్చుకొంటారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. అందరమూ నైతిక విలువలను పాటించి విజయమూ మన్ననా పొందవచ్చు. సత్యం, నిజాయితీ, ప్రేమ, కష్టించి పనిచేయడం, పేదసాదలను ఆదుకోవడం, ధైర్యం, భగవద్భక్తి మొదలైనవి మంచి విలువలు. మోసం, సోమరితనం, ఆడితప్పడం మొదలైనవి దుష్ట విలువలు.

నైతిక విలువలు అంటే మంచిని కోరుకోవడం, చెడ్డను విసర్జించడం. మన భాషలో “ధర్మం" అనేపదం నైతిక విలువలనే సూచిస్తుంది. విలువలు చాల వున్నాయి. వ్యక్తిగతమైన విలువలు, సామాజిక విలువలు, నైతిక ఆధ్యాత్మిక విలువలు అని వీటిని చాల రకాలుగా విభజించారు. ఎవరికి యిష్టం వచ్చిన