పుట:NagaraSarwaswam.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

83


ముగుస్తుంది. కాని కొన్నిచోట్ల తాము మొదట చూచిన రూపము, తమమనస్సులో కోరిక పుట్టించిన రూపము మనస్సునుండి తొలగిపోక మాటిమాటికి కల్లోలాన్ని సృష్టిస్తూ దానినిగూర్చియే భావించేటట్లు చేస్తుంది. ఈవిధంగా మాటిమాటికి ఆరూపాన్ని భావించుటవలన మనస్సులోని కోరిక పూర్వముకంటె బలముకలదిగా మారుతుంది. ఇట్టిస్థితి 'అనుస్మరణము' అనబడుతుంది.

4 గుణకీర్తనము :- అనుస్మరణస్థితి ప్రబలముగా ఉన్న స్త్రీ పురుషులు తాము ప్రేమించిన వారినిగూర్చి భావించుటతో మాత్రమే తృప్తి చెందరు. వారు తమ ప్రియతములయొక్క గుణాలను, వర్తనమును తెలిసి కొనుటయందు, తెలిసిన గుణవర్ననములకు తమలో తామైకాని, లేక ప్రాణమిత్రుల యెదుటకాని మాటిమాటికి కొనియాడుటయందు ఆసక్తిచూపుతారు ఇట్టిపరిస్థితి "గుణకీర్తనము" అనబడుతుంది.

5 ఉద్వేగము :- గుణకీర్తనమువలన కూడ కోరికకు బలం పెరుగుతుంది. అలాకోరిక మిక్కిలి బలముకలదైనపుడు అది తీరితేసరే! అదితీరకపోతే అట్టి ప్రబలమైన కోరికగల స్త్రీ పురుషులు ఏదో ఆవేశాన్ని ప్రదర్శిస్తూవుంటారు. వారి మనస్సులోని ఈకోరికయొక్క స్వరూపం తెలిసినవారు మాత్రమే వారి ఆవేశానికి కారణం గ్రహించ గలుగుతారు. ఇతరులకు వారి ఆవేశము కారణరహిత మనిపిస్తుంది. ఇట్టిస్థితి 'ఉద్వేగము' అనబడుతుంది.

6 విలాపము :- ఉద్వేగావస్థయందు కూడ కోరిక తీరక ఆ ఉద్వేగము ప్రబలముగా ఉన్నప్పుడు ఆ అవస్థకు చిక్కిన స్త్రీ పురుషులు ఏకాంతములో విలపిస్తారు. ఇట్టిఅవస్థ 'విలాపము' అనబడుతుంది.

7 ఉన్మాదము :- ఉన్మాదము అనగా పిచ్చి. విలాసావస్థయందుకూడ కోరికతీరక ఆ విలాసావస్థ ప్రబలంగా వుంటే ఆ స్త్రీ పురుషులు ఉన్మత్తులు (పిచ్చివారు) అవుతారు. ఈ అవస్థ ఉన్మాదావస్థ అనబడుతుంది.