పుట:NagaraSarwaswam.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

65


విషయంలో అలాకాక యౌవనం వస్తూనే ఉద్ధృతంగా వస్తుంది. ఉడ్డోలంగా విజృంభిస్తుంది. నిన్నకాక మొన్నటిది. రెండు నెలలేకదా అయింది. దీనిని చూచి, అప్పుడే ఎంత మారిపోయింది. ఎంత మనిషి అయింది-అన్నమాటలు ఉద్ధృతంగా యౌవనం ప్రవేశించగా మారిన వారిని గూర్చి లోకం అంటూ వుంటుంది. అట్టి స్త్రీలయందు మద్యము త్రావినవారియొక్క లక్షణాలతో సమానమైన లక్షణాలు కొన్నిగోచరిస్తాయి. ఇదుగో! ఈ లక్షణ సముదాయమునకే మదము అనిపేరు. "మదవతి" అనగా నాలుగు అంచులా సందు లేకుండా వ్యాపించిన యౌవనంవల్ల పిటపిటలాడుతూ కనులకు నిండుగా సుపుష్టంగా కానవచ్చే యువతి, యువతీ శరీరంలో గోచరం అయ్యే యీమదం అనగా యౌవనంయొక్క అధికస్ఫూర్తి పురుషుని మానసంలో శృంగారభావానికి అధికమైన దీప్తి కలిగిస్తుంది.

"ఏమేవ్! నీవు చాలా మారేవు. నిన్న మొన్నటిదాకా నీ యీ మార్పు నేను గమనించనేలేదు. నీవు మాటాడుతూ ఉండగా తెల్లని నీ పలువరుస వెన్నెలలు కురియిస్తూ వున్నట్లున్నది అనిపిస్తోంది. నీ చూపులలో మంచి దీప్తి ఏర్పడ్డది. బుగ్గలు నున్నగావుండి నాకే ఒకసారి ముద్దుపెట్టుకొనాలి అనిపిస్తోంది. కనుబొమలకు నాట్యంలో పాండిత్యం అలవడినది. నడకలో ఒయ్యారాలు ప్రవేశించాయి. స్వభావంలో చాంచల్యం ఏర్పడినది. నీవు మన్మధుని చేతిలోని సానపెట్టిన ఖడ్గంలావున్నావు. ఇక నీపతి ఎలాటివాడైనా నీఆన మీరలేడు.

ఇట్టిమాటలు మదంఅనే శృంగారచేష్టను ప్రదర్శించే వనితలను గూర్చి లోకం అంటూవుంటుంది.

11 మోట్టాయితము :- ప్రియునిగూర్చినవిషయాలు ఎవరైనా చెబుతూవుంటే వింటూ వనిత ఒడలు విరచుకొనడం, ఆవులించడం, చెవులలో వ్రేళ్లుంచుకొని ఇటునటుకదపడం జరిగితే ఆ చేష్ట 'మోట్టాయితము' అనబడుతుంది.