పుట:NagaraSarwaswam.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగర సర్వస్వం

పీఠిక.

నాగర సర్వస్వం అంటే యేమిటి ? అన్న సందేహం ప్రతి పాఠకుని మనస్సులోను తొలుత ఉదయిస్తుంది. ఆ సందేహాన్ని నివారించి గ్రంథంలోని విషయాలను వివరించడం మంచిదికదా! ఆ సందేహ నివారణ కొఱకే యీ పీఠిక.

పూర్వ కాలంలో రిపుంజయుడనే మహారాజు మాహిష్మతీ నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆరాజు పరమసుందరుడు. ఆయన శౌర్యం సాటిలేనిది. ఆయన సంపదకు కుబేరుడు. బుద్ధికి బృహస్పతి అయి ప్రజారంజకంగా రాజ్యంచేస్తూ ఉండేవాడు.

రిపుంజయుని సౌందర్యంచూచి నలుగురు రాచకన్నియలాయనను వరించారు. వారు నలువురు సుందరాంగులే, ఉన్నత కుటుంబాలనుండి వచ్చినవారే, అందువలన రిపుంజయుడు వారితో కలిసి విహరిస్తూ భూమి మీదనే స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తూ ఉండేవాడు. ఆయన తన భార్యలను నలుగురను సమానమైన ప్రేమతో ఆదరిస్తూ వారిలో వారికి మాత్సర్యం కలుగకుండచూస్తూ ఉండేవాడు. ఇలా ఆ రాజు ఎంతో నేర్పుతో వర్తిస్తూ ఉండడం వల్ల మనస్సులో ఏలాఉన్నా పైకిమాత్రం ఆ నలువురు భార్యలు అక్క చెల్లెండ్రవలె కలిసిమెలసి ఉంటూండేవారు.

కొంతకాలానికి ఆ నలువురు భార్యలు గర్భవతులయ్యారు. నలుగురు భార్యలు ఒక్కసారి గర్భవతులు కావడంతో రాజుయొక్క ఆనందానికి అవధిలేకపోయింది. ఆయన పట్టరాని ఉత్సాహంతో ఎన్నో వినోదాలు, వేడుకలు ఏర్పాటు చేయించాడు. రాజకార్యాలన్నీ మంత్రులకు అప్పగించి తాను ఎల్లవేళలా అంతఃపురంలో భార్యల సన్నిధానంలో గడపసాగాడు.