పుట:NagaraSarwaswam.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

57

ఇలా నివురు గప్పిన నిప్పులా తన ఉనికి తనకే తెలియనంత అజ్ఞాతంగా ఉన్న 'రతి' (సంభోగేచ్ఛ) తనకు నచ్చిన యువతీ సందర్శనంతో పురుషుని మనస్సులోను, అందగాడైన యువకుని సందర్శనంతో తరుణీ మానసయందు-ఆ నివురు తొలగించుకొని కొంత బయటకు వస్తుంది. అంటే అజ్ఞాతంగా ఉన్న "రతి" యువతీ యువకులను, వారి వేషభాషాదికాన్ని, వయస్సును, సౌందర్యాన్ని వాతావరణాన్ని (వసంతకాలం, సాయంసమయం, మలయపవనం, వెన్నెలరాత్రి) ఆలంబంగా (ఆధారంగా) చేసికొని మేలుకొంటుంది.

అలా "రతి" ఇంచుక మేలుకొన్నంతనే దానియొక్క దీప్తి మనస్సులోనికి, బుద్ధిలోనికి, వాక్కులోనికి, శరీరంలోనికి వ్యాపిస్తుంది. అనగా మనస్సుయొక్క ఆలోచనాశక్తి, బుద్ధియొక్క వివేచనాశక్తి పూర్వంవలెకాక క్రొత్తదారులు త్రొక్కుతాయి. మాటలలో, శరీరంలో కొంతమార్పువస్తుంది.

ఒకయువతి ఉద్యానవనంలో ఏకాంతముగా సంచరిస్తోంది. వాతావరణం సుందరంగా వున్నది. ఆ సమయంలో అక్కడకే వచ్చిన ఒక యువకుడామె కంటబడ్డాడు. ఆ యువకుని చూచేసరికి ఆమె మనస్సులో ఏదో ఒక వింతకదలిక కలిగింది. సాయంకాలము, ఏకాంత సమయం ఆ యువకుని సౌదర్యం కారణాలుగా ఆ కదలిక మరికొంత పెరిగింది. అప్పుడామె మనస్సు సిగ్గుచే ఆవరింపబడ్డది. బుగ్గలు అనుకోకుండానే కొంత ఎఱుపెక్కాయి. ఆమె ఆయువకునితో ఏవో మాటలు మాట్లాడింది. ఆ మాటలలో ఏదో వింత సౌందర్యాలను వెలిజిమ్ముతుంది.

ఇదంతా "రతి" (సంభోగేచ్చ) ఇంచుక మేలుకొన్న తరువాత జరిగేపరిస్థితి. ఈస్థితికి చేరుకొన్న రతియే శృంగారభావమనబడుతుంది.

ఈ భావమే 1 అల్పము, 2 సామాన్యము, 3 అధికము అనే మూడు రకాలుగా వ్యక్తం అవుతూంటుందని వెనుక చెప్పబడ్డది.