పుట:NagaraSarwaswam.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

51


నేను నిన్ను సర్వదా విడిచిపెడుతున్నాను—అనడానికి సంకేతమై ఉన్నది.

అలా మధ్యకు చీల్చిన తమలపాకులనే మిక్కిలి సన్నని ఎర్రదారముతో కుట్టి చుట్టచుట్టి పంపుట-'నా ప్రాణములు పోవుచున్నవి. ఒకసారివచ్చి నీవు నన్ను కలిసిన నిలచునేమో'–అనుటకు సంకేతముగా చెప్పబడ్డది.

'తమలపాకును ముక్కలు ముక్కలుగా చించి, ఆ ముక్కలను మరల సరిచేసి, పూర్వపు ఆకారము వచ్చునట్లు వేరొక ఆకుమీదపరచి వానియందు పోకలనువుంచి, వానిమధ్య నిండుగా కుంకుమపూవుపెట్టి, చుట్టచుట్టి, ఆ చుట్టపై సువాసనలుచిందే మంచి గంధము లేక గంధమువాసనగల అత్తరుపూసి పంపుట'-నాకు నీమీద వర్ణింపనలవికాని ప్రేమ ఉన్నదని చెప్పుటకు సంకేతముగా చెప్పబడినది.

ఈ సంకేతాలను వినియోగించడానికి ధనికులే కావాలన్న నియమంలేదు. సాధారణ గృహస్థులైన ఆలుమగలుకూడ యీ సంకేతార్థాలను గుర్తించినవారై వీనిని వినియోగిస్తే విచిత్రమైన ఆనందం మానసికంగా అనుభవింపగలుగుతారు.


పుష్పమాలా సంకేతము

తాము ధరించే పూలమాలద్వారాకూడ నాగరజనం తమ మనోభావాలను వ్యక్త పరుస్తారు. మంచివైన పూవులను తెచ్చి ఎఱ్ఱదారముతో దండగా గ్రుచ్చి (ఆ దారముకూడ సన్నగా కనబడునట్లు) ధరించుట—అధిక ప్రేమకు సంకేతమై యున్నది.

ఎఱ్ఱదారమునకు బదులు పసుపుపచ్చని దారము వినియోగించినచో—'నాకు నీ మీద ప్రేమ ఉన్నది' అని సాధారణమైన ప్రేమను సూచించుటకు సంకేతమై యున్నది.