పుట:NagaraSarwaswam.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49


అతని కౌగిలికి ఎప్పుడు చేరుకొందునా అని తహతహపడుతూన్నది. అతడేవో కబుర్లలో మునిగియున్నాడు. అప్పుడు భార్య యీ "కందర్పము" అనే తాంబూలాన్ని అతని యొద్దకు పంపితే ఆమె తన మనస్సులోని భావాన్ని సుందరంగా చెప్పినది అవుతుంది.

కందర్ప తాంబూలాన్ని పంపిన భార్యవలెనే భర్తకూడ విజ్ఞుడైనవాడు ఆతాంబూలాన్ని చూచినంతనే ఆతని మనస్సులో మల్లెలు, మొల్లలు విరియబూస్తాయనడానికి తాను మన్మధసామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైనట్లుగా అతడు ఆనందిస్తాడనడానికి సందేహంలేదు.

పర్యంకము:—"పర్యంకము" అనగా మంచము. తమలపాకులను చక్కగా మడచి మంచముయొక్క ఆకృతిలో నిర్మించిన తాంబూలము 'పర్యంకము' అనబడుతుంది. తాంబూలానికి ఇట్టి ఆకృతివచ్చుటకు లవంగాలు మిక్కిలి తోడ్పడతాయి. తమలపాకులను చక్కగా-బల్లపరుపుగా దీర్ఘచతురముగా మడచి, వానిమీద చతురస్రముగా కత్తిరించిన లేత తమలపాకును పరచి నాలుగువైపుల యందు నాలుగు లవంగాలు గ్రుచ్చాలి. అప్పుడు దానికి మంచముయొక్క పై భాగమునంటి ఆకారం యేర్పడుతుంది. పరుపబడిన లేత తమలపాకు మంచంమీది దుప్పటివలె భాసిస్తుంది. ఇక కోళ్లు, వాని కొఱకుకూడ లవంగాలనే వినియోగించాలి. ఆ తాంబూలముయొక్క అడుగు భాగములో నాలుగువైపుల యందు నాలుగు లవంగాలను పూర్తిగాకాక కొంతవరకు గ్రుచ్చివదలితే అవి నాలుగూ మంచంయొక్క నాలుగు కోళ్ళవలె భాసిస్తాయి.

ఇట్టి యీ పర్యంక తాంబూలాన్ని నాగరజనం సంయోగాభిలాషను వ్యక్తం చేయడానికి సంకేతంగా వాడతారు.

చతురస్రము:—తమల పాకులను గుండ్రని చుట్టుగాకాక నాలుగుకోణములు వచ్చునట్లు చుట్టినచో చతురస్రము అనబడుతుంది. 'చతురస్రము' అనగా నాలుగు కోణములుకలది. అలా కోణాలు రావడానికి తమలపాకులను నాలుగింటిని చివరలు వేరువేరుగా కనబడునట్లు