పుట:NagaraSarwaswam.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42


భాషా సంకేతాలు, అంగసంకేతాలు అయిన పిమ్మట పోటలీ సంకేతాలు, వివరింపబడుతున్నాయి.

'పోటలీ'-అనగా పొట్లము. ప్రియుని యెదుటకు తనకుతానై వెళ్ళడానికి వీలుకుదరనప్పుడు నాగరయువతులు ఇతరులకు తెలియకుండ ఈ పోటలీ సంకేతాలను వినియోగిస్తారు.

"ప్రియుడు ఎక్కడనో వున్నాడు. అతనిని తాను ప్రేమిస్తూ ఉన్నది. తన యీప్రేమవార్త అతనికి తెలియాలి"-అన్నప్పుడు-సుగంధ ద్రవ్యాలు, వక్కలు, కవిరి పొట్లాముగాకట్టి అతనియొద్దకుపంపడం"—సంకేతముగా చెప్పబడ్డది.

ఎవరైనా యువతి కొన్ని సుగంధ ద్రవ్యాలను పొట్లముగాకట్టి తనయొద్దకు పంపడం జరిగితే, పురుషుడామె తన్ను ప్రేమిస్తూన్నదని గ్రహించాలి.

'నాకు నీ మీద ప్రేమ చాలాధికం'—అని సూచించడానికి-చిన్న ఏలకులు, జాజికాయ, లవంగములు పొట్లముగాకట్టి పంపుట-సంకేతముగా చెప్పబడినది.

అట్టిదైన పొట్లము తనవద్దకు పంపబడినప్పుడు ఆపొట్లమును పంపినవారు తన్ను అధికముగా ప్రేమిస్తున్నారని నాగరకులు గ్రహించాలి.

ఒకప్పుడు ఒకజంట ఒకరిమీద ఒకరు అనురాగం కలవారై సాంకేతికంగా కలిసి విహరించి, కొంతకాలానికి అందులో ఒకరికి ఒకరిమీద ఏదో కారణంవల్ల విరక్తికలిగి తమప్రేమకు స్వస్తి చెప్పదలచినప్పుడు 'పగడమును' పొట్లముగాకట్టి పంపుట సంకేతముగా చెప్పబడ్డది.

తనయొద్దకు పగడము పొట్లముగాకట్టి పంపబడినప్పుడు-ఆపంపినవారు ఇంతవరకూ తన్ను ప్రేమిస్తూన్నా, ఇప్పుడు ప్రేమించడంలేదని, తమప్రేమకు స్వస్తి చెప్పేరని- నాగరకులు గ్రహించాలి.

చిరకాల సమాగమానాన్ని సూచించడానికి-రెండు పగడములను పొట్లముగాకట్టి పంపడం—సంకేతమైయున్నది.