పుట:NagaraSarwaswam.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

అట్లే బొటనవ్రేలితో నడుమవ్రేలిని తాకినప్పుడు దక్షిణ దిక్కనియు, ఉంగరపువ్రేలిని తాకినప్పుడు పశ్చిమదిక్కనియు, చిటికెనవ్రేలిని తాకినప్పుడు ఉత్తర దిక్కనియు గ్రహించాలి.

ప్రియుని లేక ప్రియురాలిని ఫలానా తిథినాడు రమ్మని చెప్పడానికి వేరే సంకేతాలు వున్నాయి.

పాడ్యమినుండి పూర్ణిమకు లేక అమావాస్యవరకువుండే తిథులు మొత్తం పదునైదు. శుక్ల పక్షము (వెన్నెలరాత్రులు) కృష్ణ పక్షము (చీకటి రాత్రులు) అనే రెండు పక్షాలలోనూ అవే తిధులు పునరావృత్తం అవుతాయి. అంటే తిధులు పదునైదు—పక్షాలు రెండు అయివున్నాయి.

శుక్ల పక్షమునకు ఎడమచేయి, కృష్ణ పక్షమునకు కుడిచేయి సంకేతాలుగా చెప్పబడినాయి. చేతివ్రేళ్ళను పరిశీలిస్తే ప్రతి వ్రేలు మూడు కణుపులుగా వుండి ఒక్కొక్క వ్రేలికి మూడేసి రేఖల చొ॥న మొత్తము పదునైదు రేఖలు కలవై యుంటాయి. ఈ రేఖలు పదునైదూ పదునైదు తిథులకు సంకేతాలై వున్నాయి. ఎడమచేతి రేఖలు శుక్లపక్ష తిధులను సూచిస్తే కుడిచేతి రేఖలు కృష్ణపక్ష తిథులను సూచిస్తాయి. అయితే యే రేఖ యే తిథికి సంకేతము? అన్న విషయం తెలియదుకదా!

చిటికెనవ్రేలి దిగువరేఖ (గోటిదగ్గరదికాదు) మొదలు వరుసగా ఈ పదునైదు రేఖలు పదునైదు తిధులకు సంకేతాలై వున్నాయి.

చిటికెనవ్రేలియొక్క దిగువరేఖ పాడ్యమితిధి, మధ్యరేఖ విదియకు మూడవదైన పై రేఖ తదియకు సంకేతాలు. ఆ తరువాత వుంగరపు వ్రేలియొక్క పై రేఖనుండి క్రిందికి గణించాలి.

ఉంగరపువ్రేలియొక్క పై రేఖ చవితికి, మధ్యరేఖ పంచమికి, దిగువరేఖ షష్టికి సంకేతాలై ఉన్నాయి. పిమ్మట ఆరంభమయ్యే నడిమివ్రేలి రేఖలను దిగువ రేఖనుండి లెక్కించాలి.