పుట:NagaraSarwaswam.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39

అలా గ్రహించినమీదట-'ఇది తగిన సమయమే'-అని చెప్పదలచినపుడు 'అంజలి బంధం' (దోసిలి పట్టుట) సంకేతముగా చెప్పబడ్డది.

తన వంకకు చూస్తూ ప్రియురాలు 'అంజలి బంధం' ఆచరిస్తే-ప్రియుడు ఆమెను కలియడానికి ఇది తగిన సమయమేనని గ్రహించాలి. తగిన సమయం కాదనుటకైతే "ప్రాకారముద్రాసంకేతము" వెనుక చెప్పబడ్డది కదా! దానిని వినియోగించాలి.

అయితే తగినసమయం అని చెప్పినా-పురుషుడు వెంటనే ముందడుగు వేయడానికి తగినంత ఆదరపూర్వకమైన ఆహ్వానం ఉండాలికదా! అట్టి ఆహ్వానం చేయదలచినప్పుడు 'అంజలీ కుంచనం' (దోసిలిని మూయడం) సంకేతమై ఉన్నది.

ప్రియురాలు 'అంజలీ కుంచనం' ఆచరిస్తే ప్రియు డామెరమ్మని ఆహ్వానిస్తూన్నదని గ్రహించాలి.

అయితే ఆమెరమ్మని ఆహ్వానిస్తోందేకాని ఎక్కడకు రమ్మంటూ ఉన్నదో అన్న విషయం ఈ పురుషునకు తెలియాలికదా! అందుచే దానికి వేరే సంకేతాలు చెప్పబడినాయి.

చేతివ్రేళ్ళు బొటనవ్రేలుకాక 1 చూపుడువ్రేలు, 2 నడిమివ్రేలు, 3 ఉంగరపు వ్రేలు, 4, చిటికెనవ్రేలు అని నాలుగు వ్రేళ్లున్నాయికదా! ఈ వ్రేళ్ళు నాలుగు క్రమంగా తూర్పు-దక్షిణము-పశ్చిమము-ఉత్తరము అనబడే నాలుగు దిక్కులకు సంకేతాలై వున్నాయి.

అనగా ప్రియురాలు 'అంజలిబంధం-అంజలికుంచనం' ఆచరించి-తన బొటనవ్రేలితో చూపుడువ్రేలిని 'ముక్కుపొడుము పట్టినట్లు' పట్టుకొని ప్రదర్శిస్తే పురుషుడు-ఆమె తూరుపు దిశయందున్న సంకేతస్థలానికి (అక్కడ ఏతోటయో, చెఱువో, దేవ్యాలయమో, లేక మరియొక జనంలేని స్థలమో ఉండవచ్చును. దానిని పురుషుడు ఊహించి తెలిసికొనాలి.) రమ్మంటూన్నదని గ్రహించాలి.