పుట:NagaraSarwaswam.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37


కార్యం మాత్రమే నెరవేరుతుంది. ప్రియుడుకాని, ప్రియురాలుకాని ఎదుటబడినప్పుడు మాటాడవలసినవి ఎన్నో వుంటాయి.

చిరకాలానికి ప్రియుడు కంటబడినపుడు ముందు—"కులాసాగా ఉన్నావా? నేను కులాసాగానే ఉన్నాను" ఈ మొదలైన కుశల ప్రశ్నలు ఏమీలేకుండా-"నేను నిన్ను కలియగోరుతున్నాను, ఫలానా సమయానికి రావలసినది"-ఇత్యాది విషయాలను సాంకేతికంగా చెప్పినా, అది నాగరకత అనిపించుకోదు. అందుచే భాషా సంకేతములే కాక ఇతర సంకేతములుకూడ అవసరం అయ్యాయి.

శరీరంలోని అవయవాలతో చేయబడి సంకేతాలనే అంగ సంకేతాలు అని అంటారు.

'చిరకాలానికి ప్రియుడు కనిపించాడు—కాని అతడు పదుగురిలో ఉన్నాడు-కులాసాగా ఉన్నావా? అని అడగాలని ఉన్నది—కాని అందరియెదుట అలా ప్రశ్నిస్తే నవ్వుతారు—ఆ ప్రియుడుకాక భర్తకాక పరపురుషుడే అయితే నలుగురిలో నవ్వులపాలు కావడమేకాక అత్తయింట కాపురంచేసికొనే వయసుకత్తె తన కాపురానికే నీళ్ళు వదులుకోవలసి వస్తుంది. ఆ బాధలు ఏమీ అక్కడలేకుండా ఈ సంకేతాలు వినియోగపడతాయి.

"కులాసాగా ఉన్నావా?" అని ప్రశ్నించడానికి చేతితో తన చెవిని తాకడం— సంకేతముగా చెప్పబడ్డది.

తా నెరిగిన మదవతియైన యువతి సాభిప్రాయంగా తనవంకకు చూస్తూ చెవిమీద చేయివేసుకొనడం జరిగితే-ఆమె నీవు కులాసాగా ఉన్నావా? అని ప్రశ్నిస్తూ వున్నదని నాగరకుఁడైన పురుషుడు గుర్తించాలి.

అలా గుర్తించి తాను కులాసాగా ఉన్నట్లు సూచించడానికి—తన చెవిని తనచేతితో తాకాలి. అనగా కుశల ప్రశ్నలకు, కుశలంగా యున్నానన్న సమాధానానికి రెంటికికూడ చేతితో చెవిని తాకుట సంకేతమైయున్నది.