పుట:NagaraSarwaswam.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27

ఇంద్రనీలమనబడే రత్నం నీలిరంగునీళ్ళలో ఒక బుడగ (నీటి బుడగ) తేలితే అది ఎలా మెఱస్తూ వుంటుందో అలామెరసేదై ఉంటుంది. ఇట్టి మెరుపు ఇతరములైన గుణాలు కలదైనపుడు దానిని శ్రేష్టమైన ఇంద్రనీలంగా భావించాలి.

మరకతమనబడే రత్నం మిణుగురు పురుగు వీపువలె (దానివీపు మెరిసే చిక్కని ఆకుపచ్చరంగు కలదై వుంటుంది.) క్రొత్తగా మొలచిన గడ్డివలె. నీటిలో తేలియాడే నాచువలె మెరుస్తూంటుంది. ఇట్టి మెరపు ఎక్కువగా కలిగివుండి చెప్పబడిన దోషములు ఏవీలేని రత్నాన్ని వుత్తమమరకత రత్నంగా భావించాలి.

వైడూర్యాలనబడే రత్నాలలో కొన్ని నెమలి మెడవలె ప్రకాశిస్తాయి. కొన్ని వెదురుపొదయొక్క ఆకువంటి కాంతికలవై వుంటాయి. ఇవి రెండూకూడ వుత్తమమైనవే. దోషరహితంగా చూచుకొని ఇట్టి వైడూర్యాలను ధరించవచ్చును.

రత్నాలు - అవి లభించే గనులనుబట్టి, వానిరంగునుబట్టి ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇక్కడ ప్రాస్తావికంగా కొన్ని ముఖ్యమైన వానినిగూర్చి మాత్రం వివరించడం జరిగింది.

రత్నాలవలెనే నాగరకజనం తాము ఉపయోగించే సుగంధ ద్రవ్యాలనుకూడ విలక్షణంగా, వుత్తమంగా వుండేటట్లు చూచుకొనాలి. పూర్వం ఈ సుగంధ ద్రవ్యాలను ఇంటిలోనే తయారు చేసుకొనేవారు. కాని క్రమంగా అట్టి అలవాటు తొలగి సుగంధ ద్రవ్యాలను కొన్ని ప్రత్యేక సంస్థలవారు తయారుచేసి విక్రయిస్తే కొని వుపయోగించే సంప్రదాయం ఏర్పడ్డది. అందుచే వానియొక్క నిర్మాణ విధానం ఇక్కడ వివరింపబడడంలేదు.

నాగరకులు తాంబూలమునందు సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తూనే వుంటారు. స్నానం చెయ్యడానికి పూర్వం శరీరాన్ని నలుచుకొనే నలుగుపిండి, తలకు రాసుకొనే నూనే, స్నానార్ధమైన జలమూ