పుట:NagaraSarwaswam.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

అలాకాక రత్నం తగినంత బరువులేక తేలికగావుంటే అది వుత్తమ రత్నంకాదు. కాంతి కలదైనప్పటికి రత్నంలో ఎక్కడైనా చిన్న చుక్క లేక మచ్చ ఏర్పడిఉంటే అది దుష్టరత్నమే అవుతుంది. గీరలున్న రత్నాలు, పగిలిన రత్నాలు, నున్నగాకాక ఎగుడు దిగుడుగా వున్న రత్నాలు, కాకికాలువంటి రేఖలుగల రత్నాలు ఉత్తమ రత్నాలు కావు. ఈలక్షణాలలో ఏ ఒక్క లక్షణమున్నాసరే ఆరత్నాన్ని ధరించ కూడదు. వీనిని ధరించడం ఆపదలను కొని తెచ్చుకొనడమే అవుతుంది. రత్న శాస్త్రంలోకూడ (గుణవద్గుణ సంపదాం ప్రసూతి ర్విపరీతం వ్యసనోదయస్యహేతుః) "ఉత్తమమైన జాతిరత్నం గుణసంపదలను ప్రసాదిస్తే దోషయుక్తమైన దుష్టరత్నం ఆపదలను తెచ్చిపెడుతుంది" అని చెప్పబడినది.

లోకంలో అధికంగా వజ్రము-ముత్యము-పద్మరాగము-ఇంద్రనీలము-మరకతము-వైడూర్యము ధరింపబడుతూ వుంటయి.

వజ్రం కత్తి పదునువంటి పదునుకలదై వెడల్పుగా వుంటే ఉత్తమంగా భావింపబడుతుంది. ఆ పదును, వెడల్పూ అన్నవి ఎంత ఎక్కువగా ఉంటే అది అంత వుత్తమమైనదని గ్రహించాలి.

ముత్యం ముత్యపు చిప్పనుండి లభిస్తుంది. అది నున్నగా గుడ్రంగావుండి తెల్లగా మెరుస్తూంటే వుత్తమమైనదిగా తలచాలి. నున్నదనము, గుండ్రదనము తెల్లనికాంతి అనేగుణాలు ఎంత ఎక్కువగా వుంటే అది అంత వుత్తమమైనదని గ్రహించాలి.

పద్మరాగమనబడే రత్నం బంధూక పుష్పమువలె, (మంకెన పూవు) మగకోకిల కనుగ్రుడ్డువలె, గురివెందపూసవలె మెరస్తూంటుంది. ఇట్టికాంతి తగినంతవుండి బరువు-నున్నదనము-స్వచ్చత్వము-సమత్వము అనే గుణాలు కలదై వెనుక చెప్పిన దోషములు లేకుండా వుంటే అది వుత్తమ పద్మరాగంగా భావించదగినది.