పుట:NagaraSarwaswam.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25


గణంలో నిరంతరం విహరించే యేర్పాటుకూడ నాగరకులు చెయ్యవలసి ఉంటుంది.

ఈ అన్నిటివలన ఆ నాగరకుని నాగరకతా లక్షణం వ్యక్తమై సర్వుల హృదయాలలోను అతడంటే ఒక ప్రత్యేకభావం ఏర్పడుతుంది. అయితే ఈ అలంకరణం అంతా తాను ఎవరినో మిక్కిలి నాగరకురాలైన వనితను ప్రేమించనారంభించి, ఆమెయొక్క అనురాగాన్ని సపాదించగోరి అప్పటికప్పుడు యత్నిస్తే సాధ్యంకాదు. తనను ఇంటిని అలంకరించుకొనడం నాగరకుని లక్షణం. ఆలక్షణమే అవసరమైనప్పుడు నాగరక వనితానురాగసంపాదనానికికూడ తోడ్పడుతుంది.

రత్నాలు - సుగంధాలు;

బాగా ధనవంతులైనవారు కేవలం బంగారు నగలనేకాక రత్నాభరణాలనుకూడ ధరిస్తారు. అవి వారిసౌందర్యాన్ని పెంచుటయే కాక నలుగురిలో వారికొక ప్రత్యేక గౌరవం కలిగింపజాలినవి అవుతాయనడంలో సందేహంలేదు. కాని గుణదోషపరిశీలన చెయ్యకుండా జాతి రత్నాలను ధరిస్తే అందంమాట దేవున కెరుక, ఆపదలు ముంచుకొనివస్తాయి. అందుచే ప్రాస్తావికంగా ఇక్కడ జాతిరత్నాల గుణదోషాలు సంక్షేపంగా చెప్పబడుతున్నాయి.

దోషంగల రత్నాన్ని ఎవరైనా తెలియక ధరిస్తే అతనికేకాదు, అతని సన్నిహిత బంధువులకుకూడ ఆపదలు కలిగే సావకాశంవున్నది. అట్టి దోషయుక్తములైన రత్నాలను ధరించడంవల్ల కారాగార ప్రవేశము (జైలుశిక్ష) ఏదో తెలియబడని వ్యాధిపీడ-బంధుమరణం-ధననాశనం వంటి విపత్తులు కలుగుతాయి. అందుచే రత్నాల గుణదోషాలు తెలిసికొనడం అవసరం.

రత్నం తగినంత బరువుకలదై - మంచి కాంతికలదై-నున్నగా-స్వచ్చంగా-సమంగా ఉంటే అది వుత్తమ రత్నం అనబడుతుంది. ఇట్టి రత్నాలను ధరించడంవల్ల మేలు కలుగుతుంది.