పుట:NagaraSarwaswam.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

అసలు ఈలోకం మెక్షాన్నిమాత్రమే ఆరాధించే ముముక్షువుల వల్ల వృద్ధిచెందలేదు, వృద్ధిచెందదుకూడ. ధర్మము, అర్ధము, కామము–అనబడేత్రివర్గాన్ని ఉపాసించే వారివల్ల లోకం వృద్ధిచెందుతుంది. ఈగ్రంధము ప్రధానంగా కామాన్ని అప్రధానంగా ధర్మార్థాలను వివరించేదై వున్నది. అందుచే పండితు లెవ్వరూ దీనిని అదర రహితములైన దృక్కులతో అవలోకింపకుందుగుగాత! అని వేడుచున్నాను.

♦ ♦ ♦ ♦ ♦

ఏమయ్యా! నీవుచూస్తే బౌద్ధుడవు, సన్యాసివికదా! నీకు కామాన్నిగూర్చి వివరించే గంధరచనదేనికి? అన్న శంకగూడ కలగడం అసహజం కాదు. ఇదేదో బౌద్ధధర్మానికి వ్యతిరేకమైనపని నాచే ఆచరింప బడుతూ ఉన్నదనికూడ అనిపిస్తుంది.

ధర్మము-అర్ధము-కామము-అనేవి లోకోపకారక విషయాలేకాని లోకానికి అపకారం కలిగించేవికావు. విద్వాంసులు లోక కల్యాణానికై శ్రమించి ఆనందించేవారై ఉంటారు. అందుచే ధర్మముతో అర్ధముతో కూడినదై కామాన్ని వివరించే యీ శాస్త్రరచన వల్ల నాకు కలిగే అపకీర్తి ఏమీలేదు. యీ విషయాన్ని బాగా మధించి ఆలోచించినమీదటనే నేను గంటంపట్టేను.

లోకంలో ప్రాణుల కెవరైనా ఏవిధంగానైనా ఉపకారంచేస్తే- అది నన్ను పూజించి గౌరవించడంగాను, ఏ ప్రాణికైనా అపకారం ఎవరైనాచేస్తే అది నా పరాభంగాను భావించే స్వభావం కలవాడను నేను. నా మతంకూడ అట్టిదే. నాయొక్క సుఖదుఃఖాలు లోకంలోని ప్రాణివర్గమందు నిహితులై ఉన్నాయి,

అందుచే ప్రాణివర్గానికి సుఖించే విధానాన్ని విశదీకరించే నాయీ నాగర సర్వస్వరచనం నాకూ, నామతానికీ ఉపకారకమైనదేకాని, విరుద్ధమైనదీ, అపకారం చేసేది కాదు.


★ ★ ★