పుట:NagaraSarwaswam.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

పరిచారిక ఆ పళ్ళెరాన్ని లోనికి గొనిపోయి మరికొంత సేపటికి వేరొక పళ్ళెమునుదెచ్చి యాతని యెదుటఉంచింది. అందొక చక్కని కాగితముపై సుందరముగా చిత్రింపబడిన చంద్రరేఖ ఉన్నది. ఆ చంద్రరేఖ విదియ చంద్రునకు చాలివున్నది.

“రాజపుత్రె ద్మితీయేందః"

అని శాస్త్రము. అనగా నీవు రాజపుత్రుడవా? అని అడుగుటకు విదియ చంద్రుడు సంకేతము.

అజయుడు దానివంకచూచి ఈమెప్రశ్నలన్నియు నాగరసర్వస్వ శాస్త్రమునకు చెందినవేకాబోలును. అయినచో జయపతాక నెగురవేసినటులే తలంచవచ్చును. అనుకొనుచు తాను చక్కగా చదివిన ఆ శాస్త్రసంకేతాలను స్ఫురణకు తెచ్చుకొని అచటనున్న కుంచెతో ఆ చంద్రరేఖకు వెనుకగా మేఘమాలలను చిత్రించాడు.

"ఘనచ్ఛాయస్తు భూపతిః"

అని శాస్త్రము. భూమీశుడైనచో మేఘచ్ఛాయ సంకేతము.

అందువలననే అజయుడు తాను సామాన్య రాజకుమారుడను కాననియు భూపతి ననియు సూచించుట కా కాగితముపై మేఘమును చిత్రించాడు.

పరిచారిక యాపళ్ళెరాన్ని లోనికి గొనిపోయింది. అజయుడు- రెండు ప్రశ్నలయ్యాయి. మూడున్నాయి- అని తలుస్తున్నాడు.

అంతలో పరిచారిక తిరుగ వేరొక పళ్ళెరముతో అతని యెదుటకువచ్చింది. ఆ పళ్ళెరంలో ఒక మైనపుముద్ద ఉన్నది. ఆముద్ధపై ఐదుగోళ్ళతో గ్రుచ్చినటులు గుర్తులున్నవి. మైనమునకు ఎఱ్ఱదారము చుట్టబడియున్నది.

అజయుడు దానినిచూచి రాకుమారిక పోటలీ ప్రశ్న అడిగినదే! అని తలచేడు.