పుట:NagaraSarwaswam.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

149


అనికూడ అంటారు. ఎంత ప్రయత్నించినా లొంగని వనితలు అసాధ్యలు అనబడతారు. ఈ అసాధ్యల విషయంలో తనక్షేమం కోరుకునే వాడెవడూ యెట్టి ప్రయత్నము చేయకూడదు. ఇక తప్పనిసరి అయిన వేళ ఎవరైనా ప్రయత్నిస్తే ' చావుతప్పి కన్నులొట్టవోయి నదన్న ' సామెతగా వారు చేజిక్కుతారేమోకాని ఆపద్రహితంగా అరచేతిలోనికి వచ్చి వ్రాలడం అన్నది జరుగదు.

ఈ విధంగా పరవనితలు మూడు రకాలుగా ఉన్నందున పురుషుడు తానుకోరే స్త్రీ వీరిలో ఏరకానికి చెందినదో తెలిసికొనడం అవసరం. అందుచే మూడురకాలుగా ఉన్న ఈవనితల లక్షణాలు చెప్పబడుతున్నాయి.

సులభసాధ్యలైన స్త్రీలు

ఏ ప్రయత్నము చేయనక్కర లేకయే పరపురుషునకు లొంగే స్త్రీలు ఆ పరపురుషుని ఎదుట శంకలేకుండా వర్తిస్తారు. 'చూస్తే చూడనియ్యి ' అన్నట్లు తమ స్తనాలను, చంకలను, ఉదరభాగాన్ని (కడుపు) పరపురుషుల ఎదుట మాటిమాటికీ వెల్లడిస్తారు. పరపురుషుని వంకకు సాభిప్రాయంగా చూస్తూ తమపిల్లలను కౌగలించుకొని ముద్దుపెట్టుకొనడం కూడ వీరి లక్షణాలలో ఒకటి.

వీరు పరపురుషుని ఎదుట తమ రెండుచేతులను పైకెత్తి జడ ముడివిప్పి తిరుగముడి వేసుకొనడానికి సిగ్గుపడరు, సరికదా ప్రత్యేకంగా అతని ఎదుటకువచ్చి జుట్టు ముడి సరిగావున్న ఒకసారివిప్పి తిరుగముడి వేసుకొంటారు. జుట్టుముడి విప్పాలన్నప్పుడు రెండుచేతులు పైకిలేవాలి. అలా లేచినపుడు స్త్రీయొక్క స్తనాలు, చంకలు స్ఫుటంగా వెల్లడి అవుతాయి. పరపురుషుల ఎదుట కులస్త్రీలు ఎన్నడూ ఈవిధంగా తమ అవయవాలను వెల్లడించరు. సులభసాధ్యలైన స్తీలు మాత్రమే ఈవిధంగా ఆచరిస్తారు. వీరు పరపురుషుని యెదుట అతడు చూస్తూ ఉండగా తమ స్తనాదులవంకకు మాటిమాటికి చూచుకొంటారు. తమ కంటిరెప్పలపై వ్రేలుంచి మాటిమాటికి తుడుచుకొనుటకూడ వీరి చేష్టలలో ఒకటి.