పుట:NagaraSarwaswam.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

147

వెనుక ఒక ప్రకరణంలో మన్మధావస్తలు చెప్పబడ్డాయి. వానిలో చివరి అవస్థ మరణము. స్త్రీ పురుషులలో కామం పరస్పరం చూచుకోవడంతో ఆరంభం అవుతుంది. అవి క్రమంగా మెట్లెక్కినట్లు శరీరంలో విజృంభిస్తూ ఉంటుంది. దాని విజృంభణలో చివరిమెట్టు (పదవ అవస్థ) మరణం. కాని ఈలోగానే ఆ స్త్రీపురుషులకు సంగమం కలిగితే విజృంభిస్తూ ఉన్న ఆ కామంయొక్క ఆటఅంతలో కట్టువడుతుంది. అతి మరి పైమెట్టుమీదకు ఎక్కజాలనిదగుతుంది. ఇలా కంటిచూపుతో ఆరంభమైన కామం, అభిలషించిన స్త్రీపురుషులకు సాంగత్యం ఏర్పడకపోయినా అన్నిమెట్లు ఎక్కజాలినంత బలంగా అందరియందు విజృంభించదు. ఎక్కడో, ఎప్పుడో అట్టిపరిస్థితి ఏర్పడుతుంది. అట్టిచోట తనశరీరాన్ని కాపాడుకొనడం కోసం పరస్త్రీ గమనాన్ని కామశాస్త్రాలు అంగీకరించాయంటే దానిలో దోషం లేదనిపిస్తుంది.

కాని ఇది ఎవరికివారు ఆత్మపరీక్షచేసి చూచుకొనవలసిన విషయము. "అ పరవనితను పోందకపోతే చచ్చిపోతాను" - అన్న భీతి పూర్తిగా ఏర్పడినట్లు తాను అంతరంగంలో పరిశుద్ధంగా భావించిననాడు మాత్రమే ప్రయత్నించవలసిన విషయమిది. ఇదైనా ఎందుకు అంగీకరింపబడ్డదంటే "శరీరమాద్యం ఖలుధర్మసాధనం" అన్నారు. ధర్మము యెంత గొప్పదైనా దానిని సాధించిపెట్టే సాధనాలలో మొదటిది శరీరము. అందుకే "ధర్మము, శరీరము" రెండింటిలో ఏది? అన్న ప్రశ్న యేర్పడినప్పుడు శరీరము వంకకే మొగ్గుచూపి ధర్మాన్ని కొంత చిన్నచూపు చూస్తే - అది అన్యాయం అనబడదు.

అందుచేతనే ప్రాణాపాయదశయందు పరస్త్రీ గమనానికి కొంత అంగీకారం కామశాస్త్రాలలో కనుపిస్తుంది. తన ప్రాణము పోయినను పరస్త్రీని పొందడానికి అంగీకరించనివారున్ను ఉంటారు. అట్టివారు యుగానికి ఒక్కరుకూడ జన్మిస్తారో లేదో తెలియదు.