పుట:NagaraSarwaswam.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

అజయునకిది యేమో అర్ధముకాలేదు. ప్రశ్నిస్తుందనుకొన్న రాకుమారిరాలేదు. పోనీ తన్ను గౌరవించి ఆతిధ్యమిస్తున్నారనుకొంద మంటే మామిడి చివుళ్ళ నెవరు తింటారుగనుక? దీనియర్ధ మేమై యుంటుంది. ఇట్టి సందిగ్ధావస్థలో చిక్కుకొని అజయుడు దైవమును తలుస్తూ క్షణకాలమూరకున్నాడు. అంతలో అతని బుద్ధియందు తా నెన్నడో చదివిన “నాగర సర్వస్వము”అను కామశాస్త్రమందలి సంకేతాలు స్ఫురించాయి.

'కులప్రశ్నేంకురః స్మృతః'

నీ కులమేది? అని ప్రశ్నించుటకు అంకురమును బంపుట సంకేతముగా ఆ శాస్త్రమున చెప్పబడ్డది.

ఆ రాకుమారి తన కులమునుగూర్చి ప్రశ్నించుచున్నదని అజయుడుగ్రహించి ఆ నాగరసర్వస్వమునందే చెప్పబడిన విధానాన్ననుసరించి సమాధానము చెప్పవలెననని తలంచి అటునిటు పరికించాడు.

అచ్చట ఒక బల్లమీద లక్కతో చేయబడిన దానిమ్మపండ్లు, పనసపండ్లు, అరటిపండ్లు, మామిడిపండ్లు అమర్పబడి ఉన్నాయి. అజయుడు వానిని చూచినంతనే మిగుల ఉత్సాహముతో అందలి లక్క పనసపండునుదెచ్చి, మామిడి చివుళ్ళ అంకురములున్న పళ్ళెమునందుంచాడు

దాడిమంతు ద్విజే జ్ఞేయం
    పనసః క్షత్రియే స్మృతః
కదలీజం ఫలం వైశ్యే
    తధామ్రం తూర్రజే స్మృతం.

అని శాస్త్ర సంకేతనము. అనగా బ్రాహ్మణునకు దానిమ్మపండు. క్షత్రియునకు పనసపండు, వైశ్యునకు అరటిపండు, శూద్రునకు మామిడిపండు సంకేతములై ఉన్నాయి.

నీకులమేది? అని చూతాంకురములను బంఫుటద్వారా రాకుమారి ప్రశ్నించెనుకదా! అజయుడు తాను క్షత్రియుడైనందున పనస ఫలమునంపి తనకులమును తెలియజేసాడు.