పుట:NagaraSarwaswam.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136


చంద్రకళ

మన్మధునకు స్త్రీయొక్క సర్వశరీరము నివాసస్థలమే అయి ఉన్నప్పటికి ఒక్కొక్కరోజున ఒక్కొక్క ప్రత్యేకావయవమునం దాతనియొక్క స్ఫూర్తి అధికంగా ఉంటుంది. కామభానముయొక్క దైనరూపమే మన్మధుడు. అందుచే స్త్రీశరీరంలో ఒక్కొకరోజున ఒక్కొక అవయవంలో అధికస్ఫూర్తికలదై ఉన్నకామాగ్ని అచ్చట భర్తయొక్క స్పర్శ కలిగినంతనే భగ్గున ప్రజ్వలించి ఆమెయొక్క సర్వశరీరమునందు విద్యుద్వలయాలను సృష్టిస్తుంది. దానితో ఆమె విహ్వలయై వివశయై భర్త చేతులలోనికి ఒరిగిపోతుంది. ఇలా దినదినము స్త్రీ శరీరావయవములందు మార్పుచెందే కామము ఆకాశముమీద మనము నిత్యము దర్శించే చంద్రకళయొక్క వృద్ధి క్షయముల ననుసరించి వృద్ధిచెంది క్షీణించేదై ఉన్నది. అందుచే ఈమార్పుచెందే కళను చంద్రకళ అన్నారు. నిజమునకిది కామకళ.

ఈకామకళకు, స్త్రీయొక్క శరీరములో వామభాగము మాత్రమే నివాసస్థానమైఉన్నది. చంద్రుడు శుక్లపాడ్యమి మొదలు పూర్ణిమవరకు వృద్ధిచెంది, తిరుగ కృష్ణపాడ్యమినుండి అమావాశ్య నాటికి క్షీణదశకు వస్తాడు. అట్లే ఈ కామకళకూడ శుక్లపాడ్యమిరోజున వనితయొక్క వామపాదాగ్రమునం దున్నదై పూర్ణిమ నాటికి శిరస్సును చేరుకొని, తిరుగ కృష్ణపాడ్యమినుండి క్రిందకు దిగుటకు ఉపక్రమించి, అమావాస్యనాటికి మరల యధాస్థానమునకు అనగా వామ పాదాగ్రమునకు చేరుకొంటుంది. అనగా తిధులనుబట్టి యీ కామకళా స్థానాలను గుర్తించాలి.