పుట:NagaraSarwaswam.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

వుదయం కాగానే పెద్దవాడైన అజయుడు- "నేను బసలో వుంటాను. మీరు నగరంలోనికివెళ్ళి చూచిరండి. మీరు వచ్చిన మీదట సాయంకాలం నేను వెడతాను. మధ్యాహ్నం భోజనసమయం దాటకుండ మాత్రం మీరువచ్చితీరాలి-అన్నాడు తమ్ములతో.

ఇలా అన్న అనుమతి ఈయగానే విజయుడు, సూర్యుడు, చంద్రుడు నగరం చూడడానికి వుత్సాహంగా బయలుదేరారు. ఇక్కడ - జయుడొక్కడూ వచ్చేపోయే నాగరికులను చూస్తూ సత్రం అరుగు మీద కూర్చున్నాడు.

మధ్యాహ్నం అయింది. భోజనసమయంకూడ దాటుతోంది. కాని నగరంచూడడానికై వెళ్ళిన తమ్ములు రాలేదు. అజయుడే వారిరాకకై ఎదురుచూస్తున్నాడు. అలా నిరీక్షిస్తూవుండగా సాయంకాలం కూడ గడచిపోయింది. రాత్రికూడ చాలవరకు నిరీక్షించి ఆజయుడు తన తమ్ములేమైనారో అని పరిపరివిధాలుగ ఆలోచించాడు. తెల్లవారు సరికైన రాకపోతారా? అనుకొన్నాడు.

తెల్లవారింది. కాని సోదరులు తిరిగారాలేదు. ఇక నిరీక్షించి ప్రయోజనంలేదు. నగరంలోకి స్వయంగా వెళ్ళి వారిజాడ తెలిసి కొనాలనుకొన్నాడు అజయుడు. అతడు సత్రంయొక్క అధికారికి తమ సామానులు అప్పగించి నగరంలోనికి బయలుదేరాడు. అతడెన్నో వీధులుతిరిగాడు. అన్నివీధులు జనంతోనిండివున్నాయి. ప్రతివస్తువు చూపుసు ఆకర్షించేదిగా వుంది. కాని ఆజయుడు దేనిచేతను ఆకర్షింప బడలేదు. అతనికి తన సోదరులు కనబడలేదన్న చింత ఎక్కువగా వున్నది.

సోదరులకొఱకు వెదకుతూ వెదకుతూ మధ్యాహ్న సమయానికి అజయుడొక పెద్దవీధిలో అడుగుపెట్టాడు. ఆవీథి అన్నీ వీధులకంటె సుందరంగా వున్నది, అచ్చటనైన తన సోదరులు కనపడతారేమో అన్న ఆతురతతో అజయుడు నాలుగువంకలా పరికిస్తూ ముందుకు వెళ్ళసాగాడు. అంతలో ఒక మహాభవనం అతని దృష్టిని ఆకర్షించింది.