పుట:NagaraSarwaswam.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

“ఒక చిత్రం కళావతి ఎన్నుకొన్నది, అందుచే మూడే తెచ్చాను" - అన్నాడు రాజు.

అది విన్న రెండవభార్య - మంచి చిత్రం ఆమె యెన్నుకొన్నది. ఇక యీ చిత్రాలను నాకు చూపడం ఎందుకు? మీ పెద్దకుమారునికి పెండ్లి చేసికొనండి. నేను ఎన్నికచేయనక్కరలేదు. నా కుమారుడు ఆజన్మ బ్రహ్మచారిగానే వుంటాడు అన్నది ఈర్షతో.

రాజుకు ఇది క్రొత్తసమస్య అయినది. ఆయన పెద్దభార్యకు నచ్చజెప్పబోతే అమెకూడ అంగీకరించలేదు. ఎంత శ్రమపడినా ఆరాణు లందరు ఒకరు కోరిన వధువునే వేరొకరు కోరుకొంటూవచ్చారు. దానితో రాజుకు చాల చికాకుకలిగింది. ఆయన కుమారుల వివాహాలు కుమారులే చేసికొనడం మేలైనదనుకొన్నాడు.

ఆ ఊహ తోచినంతనే రిపుంజయుడు తన నలుగురు కుమారులను పిలచి - మీరందఱు దేశాటనంచేసి తగిన కన్యలను పెండ్లాడిరండి. మీ ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాను - అన్నాడు. దానికి వారందరు సంతోషంతో అంగీకరించారు.

ఒక శుభముహూర్తాన ఆ నలుగురు రాజకుమారులు చాలినంత ధసం తీసికొని గుఱ్ఱాలమీద దేశాటనానికి బయలుదేరారు. వారు సవతితల్లి బిడ్డలేఅయినప్పటికి ఏకోదరులకంటె ఎక్కుప స్నేహము, ప్రేమకలవారు. అందుచే మిక్కిలి వుత్సాహముతో ఆయా వింతలు, విశేషాలుచూస్తూ ప్రయాణం చేయసాగారు. ఇలా వారు ఎన్నో దేశాలు గడచి చైత్రరధం అనే నగరానికి చేరుకొన్నారు.

చైత్రరధం చాల సుందరమైన నగరం. అందలి విశాలములైన రాజమార్గాలు, వున్నతములైన సౌధాలు, నగరవాసుల రూపురేఖలు, వేషభూషణాలు మనోహరంగా వున్నాయి. అందువల్ల ఆ నగరంలోని వింతలు చూడడానికి రాకుమారు లచ్చట సత్రంలో షుకాంచేశారు.