నాగానందం ఇంతలో ఓ పక్కనుండి అమృత కలశంతో వచ్చాడు గరుత్మంతుడు. మరో పక్క ప్రత్యక్షమైంది పార్వతి. ఆమ్యతంపోసి జీమూతవాహనుణ్ణి బ్రతికించాడు గరుడుడు. కమండలోదకం జల్లి చితినార్సింది పార్వతి.
లేచి వచ్చిన కొడుకుని కౌగలించుకొని, జీమూత వాహనుని తల్లిదండ్రులు పార్వతికి సాష్టాంగపడ్డారు. మలయవతి భర్తతో కలిసి గౌరికి మ్రొక్కింది. గరుడుడు శంఖ చూడని విడిచిపెట్టి, అతని ద్వారా సమస్త నాగకులానికి అభయమిచ్చి పంపాడు, పార్వతి ఆశీస్సులతో జీమూతవాహనుడికి విద్యాధర రాజ్యం లభించింది.
చెల్లీ, చూసేవా, జీమూతవాహనుడి త్యాగంవల్ల నాగకులమంతా నిర్భయంగా బ్రదుకగలిగింది. ఆందుకే యీకథ అంటే నాగుల కిష్టం. ఇది వింటే పాములవల్ల భయ ముండదు. చావు అంటే అందరికీ భయమే. బ్రతుకుమీద ఆశ అందరికీ ఒక్కలాటిదే. అందుచేత ఎంత దుష్ట జంతువు నైనా సరే చంపకూడదు. ఒకరికి అపకారంచేసినకంటే పరో పకారం కోసం ప్రాణాలు విడిచినా మంచిదే.
సర్వేజనా స్సుఖినోభవంతు.