Jump to content

పుట:Naganadham.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పక్షికి బలియై చావవలసిందేనా! ఇప్పుడే అమృతవర్షమో కురియకూడదా! తల్లీ, జగన్మాతా అంబికా, నాకుమారుని కాపాడవా!" అని పరిపరివిధాల ఏడుస్తూన్న జీమూతవాహనుడి తల్లిని చూచి గరుడుడెంతో సిగ్గుపడ్డాడు. "అమ్మా, మీరు విలపించకండి. ఈ రోజునుండి నేను నాగులను తిననని శపధం చేస్తాను. జరిగినదానికి విచారించి ప్రయోజనం లేదు. అయినా ఒక్కక్షణం మీరు ఓపికపడితే నేను వెళ్లి అమృతం తెచ్చి జీమూతవాహనుణ్ణి బ్రతికిస్తాను" అని చెప్పాడు గరుడుడు. చెప్పినంతనట్టు చేయగల సమర్ధుడు గనుక అతడు వెంటనే స్వర్గలోకానికి ఎగిరివెళ్ళాడు అమృతం తేవడానికి.

మలయవతికి వీరిమాటలేవీ వినిపించలేదు. ఆమె దుఃఖావేశంలో తన్ను తానే మరిచిఫోయింది. చితిపేర్పుంచుకొని అగ్నిలో దుముకడానికి త్వరపడుతూంది. "అయ్యో, గౌరీమాతా, నీమాటలు కూడా పొల్లయ్యేయికదూ ! నీ మొగుడు విధ్యాధర చక్రవర్తి అవుతాడు. నీవు చిరకాలం అతనితో కలిసి సుఖిస్తావు, అని పల్కిన పల్కులు శుద్ద అబద్దంగా మారిపోయాయి కదా, తల్లీ, ఇక దేనికి నా జన్మకి ఎందుకీ భగవద్భిక్తి? దేనిమీద ఆశ? ఏది అధారం! ఎవరాలంబన? అగ్నిముఖంగా నా ప్రాణంకూడ తీసివేసి సుఖించు" అని క్రోధశోకావేశాలతో పల్కుతూ ఆమె చితికి ప్రదక్షణం చేయసాగింది. ఆమెనుచూచి, ఆమె తెగింపు గ్రహించి, చేసేదిలేక విరక్తిపడి, ఆమె తల్లిదండ్రులు కూడ అగ్గిలో గెంతడానికి ఉద్యుక్తులయ్యారు.