పుట:Naganadham.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజ్యాన్ని మంత్రుల కప్పగించి తల్లిదండ్రులతో కలిసి తపస్సుకి బయలుదేరాడు. జీమూతవాహనుని ఆత్రేయుడనే బాల్య స్నేహితుడొకడున్నాడు. అతడుకూడా వారితో పాటు అరణ్యంలో ఉండడానికే నిశ్చయించాడు. వీరంతా మలయపర్వత ప్రాంతంలో ఎక్కడైనా ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొందామని అనుకొని అక్కడికి బయల్దేరి వెళ్లారు.

తండ్రిగారి అనుమతి పొంది, ఆశ్రమం కట్టుకోడానికి అనువైన స్థలం వెదక డానికని జీమూతవాహనుడు, అత్రేయునితో కలిసి బయల్దేరాడు. అది మలయ పర్వతం. పర్వతం నిండా మంచి గంధపు చెట్లే, ఎక్కడ చూచినా చెట్లు, లతలు ఒకటికొకటి పెనవేసుకొని పెరిగిఉన్నాయి. రకరకాల మొక్కలు, రంగు రంగుల పువ్వులు, పలువిధాల పక్షులు, గుంపులు గుంపులుగా ఉన్న లేళ్లు, అన్యోన్యం గా పెరిగే ఏనుగులు, ఇంకా ఏన్నో జంతువులు ఆ అడవిలో ఎక్కడ చూచినా తారస పడతాయి. అక్కడక్కడ ఎవరో మునీశ్వరులు కట్టుకొన్న తపోవనాలు, ఆశ్రమాలు కూడా ఎదురౌతాయి. ఆయా చోట్ల మంచినీటి కోనేర్లు, సలసల ప్రవహించే సెలయేళ్ళు, వేడి వేడి నీటిబుగ్గలు కూడ కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తూ, తమకి తగిన తావు వెతుకుతూ, జీమూతవాహనుడూ, ఆత్రేయుడూ కలిసి వెళ్లి వెళ్లి, ఒక ప్రాచీన దేవాలయ సమీపానికి చేరుకొన్నారు. ఈ అడవిలోయీ దేవాలయ మెలా వచ్చింది.? దీనిని ఎవరు కట్టంచారో? ఇంతకీ ఏ దేవునిది? అని వారిలో వారు ఏవేవో పిచ్చి