పుట:Naayakuraalu.Play.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

నాయకురాలు

నాయ : షరతులప్రకారం రాజ్య మివ్వమంటే మీ రేమని కాదంటారు ?

నల. రా : రాజ్యం మాదిగాని మీదిగాదు ; యివ్వడానికి వీలులేదని స్పష్టంగా తెగజెప్పుతా.

నాయ : వారు కత్తిదూస్తే ?

నల. రా : మనమూ సిద్ధమే.

నర: నేను వారి కత్తికి భయపడనుగాని, అలరాజుయొక్క సంధిప్రయత్నాలకు భయపడతా. మీకు మొగమోట మెక్కువ. ఎదుటి మనిషిని కాదనలేరు.

నల. రా : తండ్రీ కొడుకులు శత్రువులతోజేరి వారి బాగోగులు తమవని యెప్పుడనుకొన్నారో వారి సంబంధ మప్పుడే తెగిపోయింది.

నర : మీ రీ మాటమీద నిలువలేరు.

నల. రా : నీవు నా మనోదౌర్బల్యం కనిపెట్టే చెప్పుతున్నావు గాని నేను గుండె రాయి జేసుకొన్నా.

నర : ఏమో, నాకుమాత్రం నమ్మకంలేదు.

నాయ : సరే, ప్రస్తుత మాసంగతి నిలపండి. ఒడంబడిక ముగిసేటప్పటికి యిప్పటికంటె వారు తప్పక బలపడతారు.

నర : యిప్పు డేకారణంచేత వారిమీదికి పోతాం ? లోకం మెచ్చుతుందా?

నాయ : మొదట మీరు వొప్పుకొని మాచర్ల వారి కిచ్చారు. ఏడు సంవత్సరము లయినతరువాత తిరిగి యిస్తామని మళ్లీ వొడంబడిక జేశారు. ఈ రెండు వొడంబడికలప్రకారం మీరు పోయేటట్టయితే మీకేమీ పట్టులేదు.