పుట:Naayakuraalu.Play.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

నాయకురాలు

బ్రహ్మ : ధర్మరక్షణకోసం శత్రువును హింసించడమూ, అది సాధ్యంగాకపోతే ధర్మమువిడిచి పారిపోవడమూ రెండూ సత్యమునకు దూరమయినవే. ఆ రెంటిలో పారిపోవడం కంటె హింసించడమే మేలు.

బా. చం : మీరు పల్నాటిని విడిచి బయట అడుగుబెట్టిన మర్నాటినుంచీ శత్రు శేషం పనికిరాదని నాగమ్మ మన వెంటబడి వేధించి నాశనం జేస్తుంది.

బ్రహ్మ : మనం హింసామార్గ మవలంబించి ప్రతిక్రియకు పూనుకొన్నామా, నశించడమే నిశ్చయం. అహింసావ్రత మవలంబించి శత్రువును నిరోధించకుండా సత్యమును కాపాడితే నశించం. తప్పకుండా బలవంతుల మౌతాము. ధర్మబలమే బలము.

బా. చం : ఏబాధలు పెట్టినా సత్యానికి నిలువబడడం బ్రాహ్మణధర్మంగాని క్షత్రియధర్మం గాదు.

బ్రహ్మ : బ్రాహ్మణజన్మమెత్తకపోయినా సర్వోత్కృష్టమయిన సత్యవ్రతం యెవరయినా అవలంబించవచ్చు.

బా. చం : ఏడుసంవత్సరములు ప్రవాసములో నవిసినతరువాత మీరు యుద్ద మసలే చేయలేరు. ఇప్పటి బలగముకూడా జారిపోతుంది.

కొమ్మ : నాయుడుగారూ ! నాకు తెలియ కడుగుతాను, అవసరమయితే యిప్పుడుగాని, మఱొకప్పుడుగాని మాచర్ల కోసం మీరు పోట్లాడ దలచారా ?

అ. రా : సమయం నెరవేర్చి వచ్చినతరువాత పోరే అవసరం లేకపోవచ్చు.