పుట:Naayakuraalu.Play.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

87

లోనే జయ మున్నది. సాహసమే వీరలక్షణము. సాహసునకు శంకితుడు పరిపంధివర్గములోనివాడు. వెనుకకు లాగడం శంకితుని పని. ముందడుగు వేసేవాడు సాహసుడు.

అలరాజు : గతజలసేతుబంధన మెందుకు? ముందు జరుగ వలసిన పనేదో తేల్చండి.

బా. చం : బాలుణ్ణి; సాహసించి చెప్పినందుకు క్షమించండి. మనము మాచర్లను విడువక మండలమును సంరక్షించు కొందాము. కల్లజూదములో పోగొట్టుకొన్నది కత్తితో గెలుచుకొందాము. మాచర్లను మొదట అక్రమంగా తీసుకొన్నామనే అపవాదుకూడా పోతుంది.

కొమ్మ : దండోపాయాని కిప్పటికంటె మంచిసమయము రాదు. మాచర్లను విడిచిపోయి యెప్పుడో మళ్ళీవచ్చి యుద్ధం జేయడం నేలవిడిచి సాము చేయడం. అయితే యిప్పుడు యుద్ధంజేసినా గెలుస్తామన్న ధైర్యం నాకు లేదు.

బ్రహ్మ : మనము చేసేపని ముందు మన మనస్సుకు న్యాయంగా దోచాలె. దేవుడూ, లోకమూ మెచ్చేటట్టుగా వుండాలె. మనం జేసిన ప్రతిజ్ఞకు వ్యతిరేకంగా పోతే సత్యదూరుల మవుతాము. సత్యవ్రతంతో సమానమయింది లేదు.

బా. చం : మనది క్షత్రియధర్మం. రాజ్యం వీరు లనుభవించ దగినదిగాని సత్యవ్రతం బట్టే సన్యాసులకు చేజిక్కేది గాదు. మనం పోరలేమని తోస్తే యెప్పుడో తిరిగివచ్చి పోరాడుదామని భ్రమపెట్టుకొని ప్రవాసకష్టాల పాలుగావడంకంటె రాజ్యం మన కక్కరలేదని యిప్పుడే చెప్పివేస్తే నాగమ్మే యింత పొల మిప్పిస్తుంది. దున్నుకొని బ్రతుకుదాం.