పుట:Naayakuraalu.Play.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

నాయకురాలు

మ. దే. రా : పైవాండ్లకు కాలవ్యవధిగూడా చాలదులే. వడసారం వారంరోజులయినా లేకపోయె. ఇటువంటి పందేలలో నిలువబడవలెనంటే కోళ్ళకు యెంతశిక్షణ వుండాలె ! నేను పదిహేను రోజులయినా యీదించంది. కోడిని పందేనికి బెట్టను. వట్టివాటిని బెట్టి పేరుచెడకొట్టుకోవడం దప్ప యేమీ లాభం వుండదు.

బా. చం: చూస్తారా మన కోళ్ళను ?

బ్రహ్మ : పదండి. దాని చెరు పేముంది ? మళ్ళీజూతాము. నా తనిఖీకి ఆగని కోడిని యెప్పుడూ పందేనికి బెట్టను. నాకు నచ్చిన కోడి యెప్పుడూ కోసబోదు.

మ. దే. రా : అనుభవం.

బ్రహ్మ : కేవలం అనుభవమే కాదు.

మ. దే. రా : మెళకువగూడానూ. అరుగో ! రాజుగారూ, నాయకురాలూ వస్తున్నారు.

బ్రహ్మ : కాస్త హెచ్చుతగ్గుగా వేళకే వచ్చారు.

కన్న : మనము అగ్గిపడకముందే ఆరంభించాలె.

బ్రహ్మ : మన ఆలస్యమేమున్నది ? వారు సరే ననంగనే ప్రారంభింతాము.

[ నాయకురాలు ప్రవేశము ]

[ రంగస్థలములో గురిజాలవారు ఒక భాగములో కూర్చుంటారు ]

నాయ : మనవాండ్లంతా వచ్చారా? మాచర్లవారంతా తయారుగా వున్నట్లున్నదే? మాదెప్పుడూ తేమానమే. ఇంకానయం, నరసింగరాజుగారు పూనుకోబట్టి యిప్పటి కయినా తెమిలాం. అయ్యా, బ్రహ్మనాయుడుగారూ !