పుట:Naayakuraalu.Play.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

73

2వ-రంగము

మాచర్ల - కచేరిసావడి

[ మలిదేవరాజు, బ్రహ్మనాయుడు మొదలగువారు ప్రవేశము ]

బ్రహ్మ: చూచారుగదా ఆహ్వానపత్రిక . ఈయేడు కనుము పండుగ చాలా ఖులాసాగా వెళ్ళిపోతుంది. ప్రకటన ఒక్క పల్నాటికేకాదు. నాయకురా లిది చాలా మంచిపని జేసింది. చుట్టుపట్ల రాజులంతా మూగుతా రనుకొంటాను. అయితే పాపం వాండ్లకు వ్యవధి చాలదు. దేశంలో పందేలంటే యింకా సరదా పుట్టలే. కొత్తగా యిప్పుడు దేవులాడబోతే వట్టి అలికీకోళ్లు దొరుకుతవి. జాతికోళ్లు దొరకవు. నాకు వారంరోజులు గడువిస్తేచాలు. ఏరకం గావలెనంటే అవి తయారుచేస్తాను. నా కో ళ్లెప్పుడూ తయారు తింటూనేవుంటని. ఇదంతా యెందుకు - వచ్చే సంవత్సరం మాచర్లలోనే పందేలు జరుపుదాం. మనకీర్తి చుట్టుపట్లంతా వ్యాపిస్తుంది. బాలుడూ, రేపు పందేనికి నీవు కోళ్ళను యేర్చి యేర్పాటుచెయ్యి.

బా. చం : మా ముఠాలోనే వున్నవి. లోకాన్నంతా జయించగల కోళ్ళు.

బ్రహ్మ: ప్రయాణం రేపుకద్దనంగా బంట్లనన్నింటినీ ఒక్కచోట చేర్పించు. తనఖీకి వస్తా ఒక్కసారి కంటితో చూచానాఅంటే కోడిచార చెప్పివేస్తా.

కొమ్మ : నాయుడుగారూ, నా దొక మనవి. ఈ వ్యసనం కూడనిది. మనం ఆజోలి పోవద్దని నా అభిప్రాయం. ప్రస్తుత స్థితులలో పచ్చిగడ్డివేస్తే మండేటట్లుగా వున్నది. ఉభయులకు కలహాలు పెరుగుతవి. మనము ఆపలేము.