పుట:Naayakuraalu.Play.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

నాయకురాలు

ఎక్కడి కెక్కడ? హస్తిమశకాంతరం భేద మున్నది. అయితే — అట్లావుండు. ఆఁ _ భేదమా ? ఉండదుమఱీ - పశువులకూ మనుష్యులకూ భేదముండదూ? ఆహార నిద్రాదులలోనేకదా పశుప్రపంచమంతా యిమిడివున్నది ? మనోవికాసము గలవాడు మానవుడు. మానవజన్మమెత్తి పశువులవిధంగా జీవించనా ? మంచితనమనగా మట్ఠతనం గాదు. జడభరతుని జీవితపద్ధతి నాకు రుచించదు. మానవుడు మేధావంతుడయినందుకు పశుప్రాయుడుగా జీవించగూడదు. పల్నాటిని పీలికలుగా చించి జనులలో కలహములకూ, కల్లోలములకూ కారణమౌతుంటే, ఋషి సాంప్రదాయములన్నీ ధ్వంసంజేసి సంఘమును సంకరం జేస్తుంటే, పశువులాగ చూస్తూ వూరుకోనా ? మూఢ జనులవలె బాధలు సహిస్తూ పడివుండనా ? నాయందీశ్వరశక్తి ప్రస్ఫుటమై వున్నది. మంత్రశక్తికి కొదవలేదు. ఉత్సాహశక్తి యీ మహదారంభమునకు పురికొల్పినది. చతురుపాయముల నువయోగించి యీ కార్యమును సాధించితీరుతాను.

జూదము పనికిరాదా ? రాజు చతురంగబలసమేతుడై యుద్ధము చేయవచ్చునుగదా? గుఱ్ఱములకూ, ఏనుగులకూ నే కోళ్లను కలుపుతాను. ఏనుగులు పోరి రాజ్యాలు సంపాదించంగాలేనిది కోళ్లుపోరి సంపాదిస్తే తప్పు వచ్చిందా ?

కార్యమువల్ల కాకపోతే ఖడ్గము నుపయోగిస్తాను. పల్నాటి నుద్ధరిస్తాను. ఇప్పటి కీ యెత్తు వేసి చూస్తాను.

[ నిష్క్రమణం ]