పుట:Naayakuraalu.Play.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v


నాటకమునందలి ఇతివృత్తము

ఏగ్రంథముయొక్క మంచిచెడ్డలనుగాని, గుణావగుణములను గాని చర్చించుటకుముందు దాని యానుపూర్విని మున్ముందుగా కొంత నెఱింగియుండవలసియుండుట పాఠకులకు ధర్మమై యున్నది. అందునను కాలగర్భమున లీనమై, విస్మృతప్రాయమై, కథాశేషమై యున్న చారిత్రికగ్రంథము విషయములో - తత్రాపి అట్టి ప్రాచీన చరిత్రమునుండి ఇతివృత్తలేశమును సంగ్రహించి ప్రస్తుత దేశ కాల పాత్రానుసారముగ చారిత్రికతేజము నుద్బోధించుటకై ప్రవర్తించిన యిట్టి దృశ్యకావ్యముల విషయములో, పూర్వాపరసందర్భములను గోచరింపఁజేసి, గ్రంథనిర్మాణచాతురిని. తదీయ ఘనాదర్శమును విస్పష్టముగా వెలయింపజేయుటకై ఆనుపూర్విని విచారణచేయవలసి యుండుట తప్పనిసరి యైనది. కాఁబట్టి రెండు వాక్యములలో నీ నాయకురాలియందుగల కథాంశమును తేటపఱచి ఆ పిమ్మట శ్రీపంతులుగారు గ్రంథనిర్మాణమునందు గనఁబఱచిన నేర్పును బ్రశంసించుకొనుట మనకు అవశ్యకర్తవ్యమై యున్నది.

పల్నాటి పూర్వచరిత్రము

ఇందలి కథాభాగము ఆంధ్రదేశములోని సుప్రసిద్ధచారిత్రిక ఖండమగు పలనాడునకు సంబంధించినదని చదువరు లెఱింగినదే. ఈ పల్నా డనునది కృష్ణానదికి దక్షిణతీరమున సముద్రమునకు దాదాపు నూటఇరువదిమైళ్లదూరములో నున్న ఆంధ్రదేశములోని యొకభాగము. ఈ భూఖండముయొక్క వైశాల్య మించుమించు పదునొకండువందల చతురపుమైళ్లు గలదు. చారిత్రికదృష్ట్యా వీక్షించినచో ప్రస్తుతము ప్రఖ్యాతిలో నున్న మాచర్ల, గురిజాల, తుమురుకోట . కారెమపూడి మున్నగు స్థలములు ఆ పూర్వకాలమున పల్నాటిసీమలో ప్రధానపట్టణము లని మన మెఱుంగఁగలము. కేవలము ఈ పట్టములుమాత్రమేకాక ఆ కాలమున పల్నాటివీరులు త్రవ్వించిన తటాకములు, కట్టించిన కోటలు, పట్టణములు, తీర్పించిన దేవాలయములు