పుట:Naayakuraalu.Play.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3-వ అంకము

[ ప్రవేశము - ప్రతాపుడు ]

ప్ర : లోకమంతా ఒక పెద్ద కసాయిదుకాణం. మారణకర్మ అవిచ్ఛిన్నంగా జరుగుతూనే వుంటుంది. హింసాదోషంమాత్రం నా కంటదు. ప్రపంచములో ఎవరిమీదా ద్వేషంలేకుఁడా ప్రేమతో చంపేవాణ్ణి నే నొకణ్ణే. రణసాధనాలు - అంటే మారణసాధనాలు -- ప్రపంచమంతటా అమర్చిపెట్టా. కొమ్ములు, కోరలు, గోళ్లు, గిట్టలు, కొండ్లు — ఇవి నా పంచబాణాలు. వీటితో నా పని ముప్పాతికె మువ్వీసం తెమిలిపోతున్నది. కత్తి మొదలయిన కృత్రిమసాధనాలు యెప్పుడోగాని వుపయోగించను.

పల్నాడు నా ప్రేయసి. నా పౌరుషం పల్నాడంతా వెదజల్లే. ఎక్కడజూచినా నా భీకరరూపమే ప్రత్యక్ష మవుతుంది. ఏళ్ల లో కత్వలు, ఎత్తిపోతలు, సుడిగుండాలు తప్ప యెక్కడా యిసుకతిన్నెలు లేవు. గులకరాళ్లు, నాపరాళ్లు, చెకుముకిరాళ్లు, పలుగురాళ్లు మొనలుదేలి కత్తులున్నట్టుంటవి. ఇక్కడ పండ్లచెట్లకంటె ముండ్లచెట్లెక్కువ. పరాయిదేశపువాడు అక్కడి పశువులను పట్టుకోవలెనంటే చిక్కవుగదా ! స్త్రీపురుషులు ఆబాలగోపాలము అంతా వీరులే. ఆంధ్రదేశములో పల్నాటికి వీరభూమని పేరు.