పుట:Naayakuraalu.Play.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

నాయకురాలు

త్వము గోచరించినవాడికి ఏభేదములూ కనపడవు. భేదముల కజ్ఞానమే మూలము.

వీరవైష్ణవులలో భోజన ప్రతిభోజనములకు అడ్డుండ గూడదు. మీ రందరు శంకలు విడిచి నిష్కల్మష హృదయములతో చాపకూడు భుజించి సమభావమును వెల్లడించవలెనని నా కోరికె.

బ్రాహ్మ : భోజన ప్రతిభోజనములకు మరింత ప్రాముఖ్య మియ్యడమెందుకు ?

బ్రహ్మ : కులభేదములను రక్షించే కంచెగోడలు భోజన ప్రతిభోజన నిషేధములే. శాస్త్రములు కులములమధ్య అనులోమ, ప్రతిలోమ వివాహము లంగీకరించి భోజన ప్రతిభోజనములు నిషేధించినవి. అన్యోన్యవివాహములకంటె భోజన ప్రతిభోజనములే సమభావము గల్గించడమున కెక్కువ తోడ్పడతవి. కనుక ఈ విభేదమును మీరు ముందు కొట్టివేయవలసివున్నది.

అందరు : శ్రీమద్రమారమణగోవిందో హరి,

బ్రహ్మ : వీరవైష్ణవు లందరు సమానమయిన మతహక్కులు కలిగివుంటారు. వేదములు పక్షపాతము జూపినయెడల అవి త్యాజ్యములు, యజ్ఞోపవీతము అందరును వేసికొన గూడనిచో, నా సోదరునికి నిషేధింపబడినది నాకూ పనికిరాదు. సంస్కృతము అందరూ చదువగూడనియెడలఅదీ వర్జనీయమె. దీనికే త్రివిధసన్యాసమని పేరు. సమదర్శన భావమునకు ప్రతిబంధకములయిన యీ మూటిని త్యజించినవాడే ఉత్తమ సన్న్యాసి.