పుట:Naayakuraalu.Play.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

నాయకురాలు

కన్న : బ్రాహ్మణులు, వెలమలు, రెడ్లు స్వల్పంగా వచ్చారు. కోమట్లు రాలేదు. అలగాలు విశేషంగా వుంటారు. అందరికంటె మాలమాదిగ లెక్కువ.

బ్రహ్మ: కోమ ట్లసలే రాలేదా ? ఎందువల్ల ?

కన్న : లేదు, వారికి బ్రహ్మ వ్రాసిందో, బ్రాహ్మడు చెప్పిందో దప్ప మరొకటి పనికిరాదట.

బ్రహ్మ : భరన్యాపకలాపం యీరోజు జరుపుదామా ?

కన్న : కొంద రందుకోసం ప్రత్యేకంగా వచ్చారు. తమరు అనుగ్రహిస్తే నేనుకూడా అడ్డంకి తీర్చుకొనవలెననే వున్నది.

బ్రహ్మ: ఇంకా ఎవరెవ రున్నారు ?

కన్న : మంగళగిరినుంచి ఒక మాలదాసరిస్వామి వచ్చారు. బ్రహ్మతేజం వుట్టిపడుతున్నది. కేశవస్వామిసన్నిధిన తమద్వారా భరన్యాసం పొందవలెనని వున్నదట. భగవంతుని యొక్క సర్వమయత్వం ఆయన కనుక్షణమూ అనుభవములో వున్నట్టున్నది. సమదర్శనులంటే వారినే చూచాను.

బ్రహ్మ : వారిని తప్పకుండా వెటబెట్టుకొని తీసుకురా. ఏమి టా కలకలం ?

కన్న : మనవాండ్లదే. నగరసంకీర్తనం జరుగుతున్నది. దేవాలయమువైపుగా వస్తున్నారు.

బ్రహ్మ : నేనుకూడా వచ్చి కలుసుకుంటా, పద.

3 - వ రంగము

[మాచర్ల వీథి — అర్చకుడు, రెడ్డి వగైరాలు ప్రవేశం ]

రెడ్డి : ఓ స్వామీ ! ఇదేమి కలికాలమండి ?