పుట:Naayakuraalu.Play.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

53

అనుచరులము; సేవకులము. సోదరులారా ! అని పిలవడం మాకు క్షేమంగాదు.

బ్రహ్మ : మన మందరమూ భగవంతుని సేవకులము. ధర్మ నిర్వహణమునకై భగవంతు డుపయోగించు సాధనములము. భగవంతుని యెదుట అంతస్థుల భేదము లేదు. భగవంతు డేర్చుకొన్న పనిముట్లు కొన్ని యెక్కువనీ, మరికొన్ని తక్కువనీనా? భగవంతుని కృపచేత మన ప్రయత్నములు విజయము గాంచునుగాక !

2 - వ రంగము

[ సావడి - బ్రహ్మనాయుడు, కన్నమనీడు ప్రవేశము ]

కన్న : నాన్నగారికి నమస్కారము.

బ్రహ్మ : బాబా! తలంబ్రాలు గావడంతోటే గోష్టి ప్రారంభింతాము. వంటలయినవా?

కన్న : రెండువేలమందికి మాత్రమే ముందు ప్రయత్నం జరిగింది. జనము అనుకొన్నకాడికి యిబ్బడి ముబ్బడయ్యేటట్టున్నది. మరి పదిమంది కుమ్మరులను బిలిపించి అన్నం వండించి పోయిస్తున్నా. సాదం చాలినంత వుంటే సాధకం వెనుకా ముందూ సర్దుకోవచ్చు. తళియలు యెన్ని గంటల కుంచమంటారు?

బ్రహ్మ : తళియలంటే జ్ఞాపకంవచ్చింది. తగాదాలు రావుగదా?

కన్న : చాపకూటిపద్ధతికి అంగీకరించినవాండ్లుమాత్రమే గోష్ఠికి రావలసినదని ప్రకటించా. అందువల్ల తగాదా లేమీ రాకూడదు.

బ్రహ్మ : ఏ యే కులాలు వచ్చినవి ?