పుట:Naayakuraalu.Play.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

నాయకురాలు

కొమ్మ : రెంటికీ మన మంగీకరించకపోతేనో ? ?

బ్రహ్మ: దానికి జవాబు వుత్తరములో లేదు.

కొమ్మ : రెంటికీ అంగీకరించమని జవా బియ్యండి.

పిచ్చి రెడ్డి : తొందరపడవద్దు.

కొమ్మ : ఆ ఉత్తరానికి జవా బంతే.

పి. రె : వారి కోర్కెలను మన మంగీకరించనియెడల యేమి చేస్తారో చెప్ప లేదు గనుక ఉత్తరము సౌమ్యముగా వున్నది. సంధిమాటల కవకాశ మిస్తున్నది.

కొమ్మ : రెండునెలలనాడు రాజ్య మిచ్చి, ఈ రోజు మళ్లీ తెమ్మనమంటే రాజీ యేమున్నది ?

అలుగురాజు : ప్రతిపక్షముయొక్క దృష్టితోగూడా మనము యోచించాలె.

బాలచంద్రుడు : అనగా?

అలుగురాజు : వారు చెప్పేకారణాలు కేవలము నిరాధారములు గావు.

కన్నడు : మోసముచేశామంటారా?

అలుగు : కేవలము మోసముగాదు. భిడియపెట్టాము.

బ్రహ్మ: రాజ్యము ఇచ్చివేతామంటారా ?

అలుగు: రాజీగా బోదాము.

పి. రె: పోరునష్టం - పొందులాభం.

బ్రహ్మ: వారికి లోబడివుండడం గిట్టకనేగదా పంచుకొన్నాము ?

పి. రె: ఇప్పటికీ వెనుకటికీ భేద మున్నది. మన హక్కును వా కంగీకరిస్తున్నారు.

బ్రహ్మ : సామంతరాజును తొలగించే అధికారము రాజు కుండదా?