పుట:Naayakuraalu.Play.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

నాయకురాలు

బ్రహ్మ : మనము ఆ ఐహిక రాజ్యాన్ని ఆను జేసికొని, ఆముష్మిక రాజ్యాన్ని స్థాపించవలెనని అనుకొంటున్నాము. ఇహము ఆముష్మికానికి మెట్టుగా వుండాలె. వర్ణభేదాలు సమత్వ ధర్మానికి ప్రతిబంధకాలు. స్వల్పకాలమయినా స్వర్గమే అనుభవింతాము.

కన్నడు : ఈ యేర్పాటు కొంత యోచించి చేయరాదా?

బ్రహ్మ: దాసూ! యేర్పాటు అయిపోయినది.

బాలచంద్రుడు : మన మీ క్షణమునుంచీ వర్ణభేదాలను నిర్మూలంజేసి మన ధర్మం విస్తరింపజేయాలె.

[ సేవకుడు ప్రవేశము ]

సేవకుడు : అయ్యా, గురిజాలనుండి రాయబారి వచ్చి కాచుకొని వున్నాడు.

బ్రహ్మ : గురజాలనుంచా ? రాయబారా? అవశ్యము లోపలికి తీసుకొనిరా,

( సేవకుడు నిష్క్రమించును )

కొమ్మ : కొత్తమంత్రిణి సంధి కోరుతున్నదేమో?

బ్రహ్మ: కాదు, విగ్రహమే కోరుతుంది. వారు సంధి కోరదగిన పరిస్థితు లిప్పుడు లేవు.

[ రాయబారి ప్రవేశము ]

బ్రహ్మ: పొదిలె పాపన్నగారా ! రండి, .

పాపన్న : అయ్యా, క్షమించండి. ఇక్కడ ప్రభు వెవరో, నమస్కార మెవరికి జేయవలెనో తెలియడంలేదు. పేరులేని ప్రభువుకు నమస్కారము.

బ్రహ్మ : మీరు వచ్చినది రాయబారమునకా, తగవులకా ?