పుట:Naayakuraalu.Play.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

47

నాయకురాలుగాను నియమించారనీ , ఆమెకు కేతురెడ్డినీ నరసింగరాజునూ సహాయమంత్రులుగ యేర్పరచారనీ తేలింది. నాయకురాలూ, కేతురెడ్డీ మాచర్లమండలములోని రెడ్డిప్రముఖుల నందరినీ తమవైపు త్రిప్పుకొనడానికి రాయబారాలు జరుపుతున్నారు. మాచర్లమండలములో కెల్ల మహావీరుడని పేరొందిన మాడుగుల వీరారెడ్డి యీ రోజు గురిజాలకు పయనమైనట్లు తెలుస్తుంది. అతనిని బహుశా సేనాధ్యక్షుణ్ణిగా నియమిస్తారు. తమరు బాగా యోచించి యేర్పాట్లు చేయవలసిందని ప్రార్థన.

బ్రహ్మ : : గురిజాల సమాచారములు నాకూ కొంతవరకు తెలిసినవి. వైష్ణవమతప్రవిష్టులయిన తమబోటివారుదప్ప రెడ్లుగాని, ఇతర అగ్రజాతులుగాని మనకు తోడ్పడుతారని తోచదు. కన్నడు మన రాజునందు అచంచలమైన భక్తిశ్రద్ధలు గలవాడు. నాయకురాలి కెన్నడూ అతడు లోబడేవాడు గాడు. మఱియు నా భావములు కన్నడు గ్రహించినట్లు యితరశిష్యు లెవరూ గ్రహించలేదు. మన రాజ్యమును పాలించేది ధర్మముగాని, వ్యక్తులు గాదనే మూల సూత్రము మనము గ్రహించితే యీ సందేహాలు పుట్టవు.

పిచ్చిరెడ్డి : సనాతనవాదులయిన చాతుర్వర్ణ్యములవారు తమకు తోడ్పడరని నిశ్చయమేనా ?

బ్రహ్మ : చీకటి వెలుతురుకు తోడ్పడితే వారు మనకు తోడ్పడుతారు.

పిచ్చిరెడ్డి : అట్లయితే ధీశక్తిచేత తమరు సంపాదించిన రాజ్యం మలిదేవమహారాజుకు నిలువడం దుర్ఘటం.