పుట:Naayakuraalu.Play.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

27

(ఆవులు చెప్పినట్టు మఱివొక బాలిక )

పాలాకుపచ్చలా - పరువంపుపడుచా
అద్దాలరవికలా - ముద్దులాపడుచా
తంగేటి పూవుల - ధరియించుపడుచా
          మాచెర్ల అడవులూ - మనవిగాకేమి ?
          మలిదేవుడడ్డినా - మరలివచ్చేమా !

న : పల్నాటబుట్టిన పశువులకుకూడా పౌరుషమేగదా.

(కాపు బాలకుడు)

కోరకొమ్ములతోటి - కొమరొప్పుబసవా
పులిమచ్చవన్నెతో - పాలుపొందుబసవా
నీటిదావిణిబడ్డ - నీలంపుబసవా
         చంద్రవంకానీళ్ల - చాయ బోకోయి
         మాచర్లమడుగులు - మరచిపోవోయి.

కే: మాచర్ల తనకు దూరమయిందని బాలు డెంతవిచారపడుతున్నాడు ! ప్రజలభావాలు పరికించి పాలించగలవాడే ప్రభువు.

న: ఇక్కడి ఆచారాలు మా కేమితెలుస్తవి? మీబోటివాండ్లు తెలియజెప్పాలె.

(బసవడు చెప్పినట్టు మఱివొక బాలుడు )

చిరికోలబట్టిన - చిన్నిబాలూడా
చద్దిమూటలనొప్పు - ముద్దుబాలూడా
పిల్లనక్రోవూదు - పిన్నబాలూడా
        మాచర్ల అడవులు - మనవిగాకేమి ?
        బ్రహ్మన్న అడ్డితే - పారివచ్చేమా!