పుట:Naayakuraalu.Play.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

131

నల. రా : వీరాచారమనే పేరుతో ఈ కట్టుబాటు శాశ్వతముగా జరుగునుగాక!

బ్రహ్మ : మొదటి కొలుపు ఎప్పుడు జేతాం ?

నల. రా : రేపే మొదటి కొలుపు ప్రారంభం.

[ నిష్క్రమణం ]

4-వ రంగము

[ నాగులేటిలోని గంగధారి మడుగు ]

[నల. రా; నాయ; బ్రహ్మ - మొదలగు వారు ప్రవేశము]

నల. రా : వీర్లకొలుపుకు ఏర్పాట్లు జరిగినవా ?

నాయ : ఉత్సవాని కేర్పాట్లు చేయించాము. వీరాలయం కట్టించి దానిలో పల్నాటివీరులు బట్టిన ఆయుధములను నిలిపాము. ఇకముందు యుద్ధములలో చనిపోయే పల్నాటివీరులకుకూడ జాతి మత వివక్షత లేకుండా దీనిలో చోటుంటుంది. తిరునాళ్ల పూర్తిఅయ్యేలోగా వీరచరిత్ర మంతా ప్రతిసంవత్సరమూ బోధించడానికి కొందరి కీనాము లిచ్చి శాశ్వతమైన యేర్పాటు జరిగినది ఉదయము వీరాచారులందరు ముడుపులూ మొక్కుబళ్ళూ చెల్లిస్తారు. అవికాంగనే కొందరు వేషాలుగట్టి వీరచరిత్రంతా నాటక మాడి యుద్ధపట్టులో ఆ యా వీరులు పడ్డచోట పడిపోతారు. దానితో కొలుపు ముగుస్తుంది వీరచరిత్రలు వినీ, కొలుపులు జేసీ మన రాబోయే సంతానము వీర్యవంత మవుతుంది.

నల. రా : నాయుడుగారి సత్యవ్రతసిద్ధాంతాని కిది పొసగుతుందా?