పుట:Naayakuraalu.Play.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

నాయకురాలు

నల. రా : ఉభయపక్షములా ఆప్తులూ, బంధువులూ యెందరో నశించారు. అది తీరనికొరత.

బ్రహ్మ: అది విధినియతి,

నల. రా : ఇకముందు జరుగవలసిన విధానమును తమరు నిర్ణయించ కర్తలు.

బ్రహ్మ : ఏకచ్ఛత్రాధిపతులై పల్నాటిని మీరు పాలించగోరుతాను. అది భగవద్విధానమని స్పష్టపడినది. శేముషీధురీణ యయిన నాగాంబికకంటె సమర్థులయిన మంత్రులు వేరొకరు నాకు గన్పడరు. పల్నాటియందు ఆమెకు మిక్కిలిప్రేమ.

నాయ : మంత్రిపదవికి అర్హులు తమకంటె వేరొకరు లేరు. ఈ భారము తాము వహించవలసినదని మా ప్రార్థన. నేను నా పశువులను, పశుపతిని సేవించుకో బోతాను. అదియే నే మొదట గోరిన షరతు.

బ్రహ్మ : తమ రంగీకరించనిచో కొమ్మరాజుగా రర్హులని నా అభిప్రాయము.

కొమ్మ : ఆ పని నా కక్కర లేదు. ఓపినంతవరకు కత్తిపట్టి పోరాడడందప్ప రాజకీయవ్యవహారములు నాకు తల కెక్కవు.

నల. రా : ఆ పదవి తమరే వహించవలసినది. బహుకాలం మా రాజవంశమూ, మీ మంత్రివంశమూ కలసివస్తున్నవి. సంబంధం విడగొట్టవద్దు.

బ్రహ్మ : చూతాము. ఈ యుద్ధమునకు సంబంధించిన వీరులందరికి కారెంపూడి క్షేత్రములో వర్ణ వివక్షతలేక ఆచంద్రతారార్కమూ వీరపూజ యేటేట కార్తీక మాసములో ఉత్సవముతో జరుపవలసినది.