పుట:Naayakuraalu.Play.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xi

వారి సంభాషణలలో బీజనిక్షేపరూపముగా ప్రదర్శింపజేయుచు, కడునేర్పుగా నాగాంబిక (నాయకురాలి) దృఢనిశ్చయమును వెల్లడించుటతో మొదటి యంకమును శ్రీ పంతులుగారు ముగించినారు.

తర్వాత రెండవ యంకమునందు తొలిరంగమున పరపక్ష నిశ్చయమును విన్నపిమ్మట బ్రహ్మనాయుని మంత్రినిశ్చయమును వెల్లడించుటకై మాచర్లసభాభవనమును ప్రదర్శించి, కేవలసాత్విక దృష్టియును, అవిరతమగు ప్రభుభక్తియును. జానురక్తియును గల బ్రహ్మనాయుని మంతనమునున్నూ, అందలి గాంభీర్యమున్నూ, అతని యనుచరుల ఆదర్శములను వెల్లడించుచు, నాయకురాలి రాయబారిని మధ్యను ప్రవేశపెట్టించి బ్రహ్మనాయుని పక్షమునకు కదలిక పుట్టించి తద్ద్వారా రెండవపక్షమువారి ఆదర్శములున్నూ , దృఢనిశ్చయములను వెల్లడింపజేసి తదనుగుణముగా తాత్కాలిక లోకసంస్థితిని ప్రదర్శించి రెండు మూడు రంగములను ముగించి నాల్గవ రంగమునందు విక్లబ హృదయముచే వేదనపడుచున్న బ్రహ్మనాయుని నొకమారు చూపి రెండవ యంకమును నేర్పుతో ముగించిరి.

ఇకను మూడవ అంకమునందు మరల నాయకురాలి ప్రతివ్యూహరచనలను, రాజ్యతంత్రగమనిక లను ప్రేక్షకులకు రుచి చూపుచూ బ్రహ్మనాయుడు మున్నగువారిని ప్రవాసమంపుటకు అంకురార్పణయగు (కోడిపందెమును ) ద్యూతప్రయత్నమును, తదనుసారమగు నాహ్వానధోరణిని ప్రదర్శించి మొదటి రంగమును ముగించి, రెండవ రంగమున జూదమునకై ఆహూతులయిన బ్రహ్మనాయునిపక్షమువారి మంత్రాలోచనసందర్భములకు మనలను తీసికొనిపోయి, అంతతో ఆ రంగమును ముగించి, మూడవ రంగమున ద్యూతసభాభవనమునందలి ద్యూతఖేలనవిధానమును కడునేర్పుతో చూపి, బ్రహ్మనాయునిపక్షమువారి పరాజయముతో అజ్ఞాత వాసమునకు అంకురార్పణ చేయించి, సభాపర్వమును చక్కగా సంతరించి ఆ యంకమును అంతతో ముగించి, అరణ్యపర్వము నారంభించిరి.